మావోల అలజడి | Bhadrachalam agency tense with Maoists | Sakshi
Sakshi News home page

మావోల అలజడి

Dec 31 2014 12:17 AM | Updated on Oct 9 2018 2:51 PM

భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టులు వారం రోజులుగా అలజడి సృష్టిస్తున్నారు.

సాక్షి, ఖమ్మం: భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టులు వారం రోజులుగా అలజడి సృష్టిస్తున్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లు, హిట్ లిస్ట్‌పై దృషి పెట్టినట్లు తెలుస్తోంది. చింతూరు మండలం పేగ గ్రామంలో పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో 13 మందిని కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు ఇటీవల విడుదల చేసిన హిట్‌లిస్ట్ జాబితాలో పేరున్న ఓ గిరిజనుడు కూడా అపహరణకు గురైన వారిలో ఉన్నాడు.  

అంతేకాకండా ఇటీవల జరిగిన చర్ల మండలం దోసిళ్లపల్లి ఎన్‌కౌంటర్‌తో ప్రతికారేచ్ఛతో మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నెలలో ప్రారంభమైన పీపుల్ లివరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాల్లో భాగంగా సెల్ టవర్లను తగులబెట్టేందుకు యత్నం, పోలీస్ ఇన్‌ఫార్మర్లను హెచ్చరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే దోసిళ్లపల్లి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 29న మావోయిస్టు పార్టీ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. చర్ల మండలం సత్యనారాయణపురంలో ఉన్న సెల్‌టవర్‌ను పేల్చేందుకు ప్రయత్నించి పోలీసుల కాల్పులతో వెనుదిరిగారు.

చర్ల, వెంకటాపురం, చింతూరు, దుమ్ముగూడెం మండలాల్లో ఈనెల రోజుల్లో ఏదో ఒక చోట పోస్టర్లు వేస్తూనే పోలీసులకు సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, గిరిజనుల భూమి కొంతమంది కబంధ హస్తాల్లో చిక్కుకుందని జిల్లాలోని పలు మండలాల వ్యాపారులు, ప్రముఖ ప్రజాప్రతినిధులను పేర్కొంటూ ఇటీవల ఓ లేఖ కూడా విడుదల చేసింది. అలాగే చింతూరు, దుమ్ముగూడెం మండలాల్లో 17 మంది పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా మారారని వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మరో లేఖ విడుదల చేశారు.

శబరి, దుమ్ముగూడెం, వెంకటాపురం ఏరియా కమిటీలతో పాటు ఇటీవల నూతనంగా రిక్రూట్ అయిన కేకేడబ్ల్యూ (ఖమ్మం, కరీనంగర్, వరంగల్) కమిటీ పర్యవేక్షణలో ఈ మూడు కమిటీలు మన్యంలో అలజడి సృష్టిస్తున్నట్లు సమాచారం. గతంలో పోలీస్ కాల్పుల్లో తుడిచి పెట్టుకపోయిందన్న కేకేడబ్ల్యూ మళ్లీ క్రియాశీలకం కావడంతో భద్రాచలం ఏజెన్సీలో ఈ కమిటీ కార్యదర్శి నేతృత్వంలో పీఎల్‌జీఏ వారోత్సవాలు జరిగినట్లు సమాచారం. పోలీస్ ఇన్‌ఫార్మర్ల వ్యవస్థపై దృష్టి పెట్టాలని కేకేడబ్ల్యూ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకే చింతూరు మండలంలోని పేగ గ్రామానికి చెందిన 13 మంది గిరిజనులను ఈ పేరుతో శనివారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని తెలుస్తోంది.

పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా మారొద్దు..
‘ప్రజలారా డబ్బులు ఆశ చూపితే మీ భవిష్యత్‌ను పాడు చేసుకోకండి.. సమ సమాజం కోసం పాటు పడితే తప్ప మీ జీవితాలు మెరుగు పడవు. మీరే ఆలోచించండి.. లంచగొండి పోలీసులు ఆదివాసీ యువకులకు రకరకాలుగా ఆశ కల్పించి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా మారితే కఠిన శిక్ష తప్పదు’ అని శబరి ఏరియా కమిటీ పేరుతో దుమ్ముగూడెంలోని ములకపాడు సెంటర్‌లో పోస్టర్లు వెలిశాయి. ఇలా వరుస సంఘటనలకు మావోయిస్టులు పాల్పడుతుండడం.. ప్రతిగా పోలీసులు ఎదుర్కొంటుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు వణికిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement