మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకునే గోదావరి బ్యారేజీల ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కోరారు.
తుమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లకు తగ్గొద్దు: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకునే గోదావరి బ్యారేజీల ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కోరారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల కంటే తక్కువ ఉండొద్దని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం ఆ పార్టీ నేతలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కీలక విషయాల్లో విపక్షాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటానని గతంలో పేర్కొన్న సీఎం కేసీఆర్ మాట తప్పారన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలతో చ ర్చించాక మహారాష్ట్రతో ఒప్పందానికి వెళ్లి ఉంటే బావుండేదన్నారు. అలా కాకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరించారని, కనీసం తీసుకునే నిర్ణయాలైనా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా ఉండాలని కోరారు. తుమ్మిడి హెట్టి ఎత్తు తగ్గతే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. బాబ్లీపై తమ ఆవేదనను పట్టించుకోలేదని, పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని ఎల్.రమణ పేర్కొన్నారు.