దా‘రుణం’..!

BC Corporations Loans Is Not Released In Nalgonda - Sakshi

కార్పొరేషన్‌ రుణాలు అందని ద్రాక్షగా మారాయి. లోన్లు తీసుకుని స్వయం ఉపాధి పొందొచ్చని ఆశించిన నిరుద్యోగులకు ఏటా నిరాశే ఎదురవుతోంది. దరఖాస్తు చేసుకుని ఏళ్లుగడుస్తున్నా మొండిచెయ్యే మిగులుతోంది. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్‌ విడుదల చేసినా లబ్ధిదారులకు అందించడంలో అధికారులు, బ్యాంకర్లు విఫలమవుతున్నారు. దీంతో వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడం తప్పడంలేదు.

దురాజ్‌పల్లి (సూర్యాపేట) : నిరుద్యోగ యువత, కుల, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులకు ఆర్థి కంగా చేయూతనందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ప్రభుత్వం రుణాలు మంజూరు చే స్తోంది. 50శాతం నుంచి 80శాతం వరకు సబ్సి డీపై ఈ లోన్లు అందజేస్తోంది.  గతంలో 20 శాతం నుంచి 50 శాతం వరకే ఉన్న సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం 80 శాతం వరకు పెంచింది. దీంతో కార్పొరేషన్‌ రుణాల కోసం యువకులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తి దారులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2015–16లో దరఖాస్తులు చేసుకొని ఎంపికైన లబ్ధిదారుల్లో కొంత మందికి నేటికీ రుణాలు అందలేదు.

ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్‌ విడుదల చేసినా పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు, బ్యాం కర్లు.. లబ్ధిదారులకు అందించడంలో విఫలం అవుతున్నారు. దీంతో లబ్ధిదారులు సంబంధిత శాఖ, బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 254మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సి డీ విడుదల చేయగా ఇప్పటి వరకు కేవలం 157 మందికి మాత్రమే రుణాలు అందించగలిగారు. ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 161మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయగా 83 మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 1,770మంది లబ్ధిదారులకు సబ్సిడీ విడుదల కాగా 1,629 మందికి మాత్రమే ఇచ్చారు.

                                                                             
2015–16లో ఇంకా 123 మందికి...

బీసీ కార్పొరేషన్‌ రుణాలకు 2015–16లో 5,216 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ, ఇంటర్వ్యూ, గ్రామసభల ద్వారా 552 మంది లబ్ధిదారులను
ఎంపిక చేశారు. ఈ 552 మంది లబ్ధిదారులకు రూ.49,86,60,000 సబ్సిడీ అందించాల్సి ఉండగా ప్రభుత్వం 254 మందికి రూ.196.93 లక్షల సబ్సిడీని అందించాల్సి ఉండగా 157 మందికి రూ.124 లక్షలు అందించారు. ఇంకా 123 మందికి సుమారు రూ. 72 లక్షల సబ్సిడీని అందించాల్సి ఉంది. అయితే దరఖాస్తులు చేసుకున్న మూడు సంవత్సరాలకు గాను ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తే అందించడంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులు విఫలం అవుతున్నారు. బ్యాంకర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. అదే విధంగా ఇతర ఖాతాల్లో సబ్సిడీ జమ అయినట్లుగా సంబంధిత అధికారులకు 16 ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2016–17, 2017–18లో దరఖాస్తులే ఆహ్వానించలేదు.

గిరిజన సంక్షేమశాఖలోనూ అదే పరిస్థితి

జిల్లాలో గిరిజన సంక్షేమ  శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరానికి 161 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకు సబ్సిడీని విడుదల చేసింది. అయితే ఇందులో 161 మందికి రూ. 165 లక్షల సబ్సిడీ అందించాల్సి ఉండగా కేవలం 81 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. పూర్తిగా అందించామని గ్రౌండింగ్‌ కాకపోవడంతో ఆన్‌లైన్‌లో చూపడం లేదని అధికారులు చెబుతున్నా ఇంకా కొంత మందికి  రుణాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక 2016–17లో ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే రుణాలకు దరఖాస్తులు స్వీకరించలేదు. కానీ 2017–18 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 633 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ. 695.96 లక్షల సబ్సిడీ అందించాల్సి ఉంది. ప్రభుత్వం బడ్జెట్‌ రిలీజు చేయలేదు.

అందరికీ ఇచ్చామంటున్న అధికారులు

ఏస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2015–16లో 1,770 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయగా 1,629 మందికి అందించినట్లుగా లెక్కలు చూపుతున్నాయి. కానీ అధికారులు మాత్రం అందరికీ అందాయని చెబుతున్నారు. అయితే తమకు రుణాలు అందించలేదని, బ్యాంకు ఖాతా నంబర్లు మారినందున బ్యాంకర్లు ఇవ్వడం లేదని సంబంధిత శాఖలకు 15 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే  2016–17 ఆర్థిక సంవత్సరంలో 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం 524 మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేశారు. ఇందులో 132 మందికి సబ్సిడీ విడుదల కాగా నేటికీ ఒక్కరికి కూడా అందించలేదు.   

త్వరలోనే అందిస్తాం 
2015–16 సంవత్సర బీసీ కార్పొరేషన్‌ ద్వారా విడుదలైన సబ్సిడీని లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తాం.లబ్ధిదారులు.. బ్యాంకర్లకు యూసీలు అందించకపోవడం వల్ల గ్రౌండింగ్‌ కాక పెండింగ్‌ చూపిస్తున్నాయి. కొన్ని చోట్ల బ్యాంకర్ల బిజీగా ఉండటంతో లబ్ధిదారులకు అందించలేక పోయారు. అదే విధంగా ఇతర ఖాతాల్లో కొంత సబ్సిడీ పడటంతో ప్రభుత్వానికి నివేదికలు పంపాం. త్వరలోనే అందరికీ అందిస్తాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top