పురిటిలోనే పసిగుడ్డు మృతి.. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి | baby dies in nizamabad general hospital | Sakshi
Sakshi News home page

పురిటిలోనే పసిగుడ్డు మృతి.. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి

Nov 29 2018 2:26 PM | Updated on Nov 29 2018 6:02 PM

baby dies in nizamabad general hospital - Sakshi

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున పురిటిలోనే ఓ శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బాధిత బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. డిచ్‌పల్లి మండలం ఇస్లాంపుర కాలనీకి చెందిన ముస్కాన్‌ నిండు గర్భిణి. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డెలివరీ కోసం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ ప్రసవం కోసం వైద్యులు పరిశీలనలో ఉంచారు. సాయంత్రం మరోసారి సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేశారు. గర్భిణి, శిశువు ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని వైద్యులు గుర్తించారు.

రాత్రి ఒంటి గంటకు సదరు గర్భిణికి బ్లీడింగ్‌ కావడంతో హుటాహుటిన ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్‌ చేసే సరికి అప్పటికే శిశువు మృతిచెందింది. విషయం తెలుసుకున్న బాలింత బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆగ్రహించారు. ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌ను ధ్వంసం చేశారు. అత్యవసర విభాగంలోని గదులను ధ్వంసం చేశారు. కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. నలుగురు వ్యక్తులు వైద్యులను సైతం బెదిరించారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాములు పేర్కొన్నారు. ఈ సంఘటనపై అధికారులు ఒకటో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
దాడులు చేయడం అమానుషం.. 

ఆస్పత్రిపై దాడికి నిరసనగా వైద్యులపై దాడికి యత్నించడంతో ఆస్పత్రిలోని వైద్యులు బుధవారం నిరసనకు దిగారు. విధులు బహిష్కరించిన జూనియర్‌ డాక్టర్లు, ఐఎంఏ వైద్యులు కలిసి ఆస్పత్రి ప్రవేశ మార్గం వద్ద నిరసన తెలిపారు. తక్షణమే దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఐఎంఏ అధ్యక్షురాలు కవిత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు చేయడం అమానుషమన్నారు.

ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉన్నప్పటికి ఉన్న వైద్యులు భారంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి సమయంలో దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ప్రతి వైద్యుడు ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తాడని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రిపై, డాక్టర్లపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో ఐఎంఏ కార్యదర్శి సవిత, రాణి, వైద్యులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement