టీడీపీతో పొత్తే కొంప ముంచింది!


* పట్టున్న స్థానాలు దేశానికి వదలి ఓడిపోయాం

* ఇటీవలి ఎన్నికల్లో వైఫల్యంపై బీజేపీ సమీక్ష

* మెదక్ బరిలో అభ్యర్థిని నిలపాలని నిర్ణయం

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని తీర్మానంసాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల భారీగా నష్టపోయామని బీజేపీ తెలంగాణ శాఖ అభిప్రాయపడింది. తెలంగాణ తెచ్చిన పార్టీల్లో ఒకటిగా బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న సానుకూలతను టీడీపీతో పొత్తు దెబ్బతీసిందని విశ్లేషించింది. పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టే ఇలాంటి విషయాల్లో భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర నాయకత్వానికి సూచించింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై సోమవారం హైదరాబాద్ శివారు మల్లాపూర్‌లోని ఓ కల్యాణమండపంలో బీజేపీ తెలంగాణ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. బీజేపీ కేంద్ర సంయుక్త నిర్వహణ కార్యదర్శి సతీష్‌జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ రాష్ట్ర శాఖ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 

 తెలంగాణ ఏర్పడ్డ వెంటనే జరిగిన ఈ ఎన్నికల్లో వాస్తవానికి బీజేపీ మంచి ఫలితాలు సాధించాల్సి ఉండిందని, ఆ సువర్ణావకాశాన్ని టీడీపీతో పొత్తు రూపంలో కోల్పోవాల్సి వచ్చిందని, ఒంటరిగా పోటీ చేసి ఉంటే పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి ఉండేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవటం వల్ల కూడా సరైన ప్రచారం నిర్వహించలేకపోయామని దాదాపు అందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. పొత్తులో భాగంగా.. పార్టీకి పట్టున్న నియోజకవర్గాలను టీడీపీకి వదిలేయటంతో తీవ్ర నష్టం జరిగిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగం జనార్దన్‌రెడ్డి తన ఓటమికి ఇదే ప్రధాన కారణంగా పేర్కొనటం విశేషం. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని నాగం సూచించారు. కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే, త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసి పక్కాగా అమలు చేయాలని పార్టీ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. మజ్లిస్ కంటే బీజేపీనే ఎక్కువ స్థానాలు గెలిచేలా వ్యూహరచన చేయాలన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీతో పొత్తుండాలా వద్దా అనే విషయాన్ని త్వరలో నిర్ణయించాలని తీర్మానించారు.

 

ఓటమికి నైతిక బాధ్యత నాదే: కిషన్‌రెడ్డి

 సమావేశం ప్రారంభం కాగానే.. ఎవరూ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయొద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచించారు. పార్టీ ఓటమికి నైతికంగా తానే బాధ్యత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. త్వరలో జిల్లాల వారీగా సమీక్షలు జరపాలని, పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించి త్వరలో తెలంగాణకు పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సతీష్ జీ సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం పక్కాగా అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, నాన్‌లోకల్ కోటా కింద తెలంగాణలో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, ఆంధ్రాలో చదివే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడమని గవర్నర్‌కు సూచించాలని కూడా సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి,  ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, సీనియర్ నేతలు ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top