నామినేటెడ్‌ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూపులు

Aspirants Have Hopes For Nominated Positions In Joint Warangal District - Sakshi

కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు ముగిసిన, ముగుస్తున్న పదవీ కాలం..

ఉమ్మడి జిల్లాలో ఖాళీ కానున్న పది రాష్ట్ర స్థాయి పదవులు

మరోసారి అవకాశం కోసం పలువురి ప్రయత్నాలు

కొత్తవారికే అవకాశమంటూ ఉద్యమకారుల ఆశలు

సాక్షి, వరంగల్‌: విజయ దశమికి తమ దశ తిరుగుతుందన్న ఆశల పల్లకీలో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఊరేగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పది మంది టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్‌గా వాసుదేవరెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌గా గాంధీనాయక్, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పెద్ది సుదర్శన్‌రెడ్డి పదవులు చేపట్టారు. అలాగే ‘కుడా’ చైర్మన్‌గా మర్రి యాదవర్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్‌ సంస్థ చైర్మన్‌గా లింగంపెల్లి కిషన్‌రావు, గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కన్నెబోయిన రాజయ్యయాదవ్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బొల్లం సునీల్‌కుమార్, ఖాదీగ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మౌలానా యూసుఫ్‌ జాహేద్, రైతు ఆత్మహత్యల న్యాయ విచారణ, విమోచన కమిటీ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్ల దక్కించుకోగా.. మరో ఒకరిద్ద్దరికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్‌ పదవులు వస్తాయని అనుకుంటున్న తరుణంలోనే ముందస్తుగా టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోవడంతో పదవుల పందేరానికి బ్రేక్‌ పడింది. 

ముగుస్తున్న పదవుల కాలం..
రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్‌ పోస్టులు పొందిన వారి కమిటీల పదవీకాలం ముగిసిపోతోంది. ఇందులో రెండు నెలల క్రితం వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ట్రైకార్‌ చైర్మన్‌ గాంధీనాయక్, మహిళా ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి పదవీకాలం ముగిసింది. అక్టోబర్‌ 9న అంటే మరో పదిరోజుల్లో ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్‌ చైర్మన్‌ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెలు పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పదవీకాలం ముగిసిపోనుంది. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పెద్ద సుదర్శన్‌రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అది ఖాళీ అయ్యింది. డిసెంబర్‌ నెలతో హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్, ఖాదీ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ యూసుఫ్‌జాహేద్‌ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పది రాష్ట్ర స్థాయి పదవులు ఖాళీ కానున్నాయి. 

మరోసారి అవకాశం కోసం...
ఇప్పటికే పదవీకాలం పూర్తి చేసుకున్న, త్వరలో పూర్తి కానున్న సంస్థల చైర్మన్లు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు ఇప్పటికే విన్నవించుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రుల చాంబర్లలో సదరు ఆశావహ నేతలే కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విశ్వసనీయత, విధేయతే గీటు రాయి అన్న చందంగా టీఆర్‌ఎస్‌ అగ్రనేతలు పదవులు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీకి చేసిన సేవలతోనే పదవులు ఇస్తామని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పలుమార్లు సమావేశాల్లో స్పష్టం చేయడంతో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటులో నాయకులు పోటీ పడి పనిచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి స్టైల్‌లో వారు శ్రమించారని చెప్పక తప్పదు. ఖచ్చితమైన హామీ ఎవరికీ లభించనప్పటికీ ముగ్గురు మినహా గతంలో పొందిన నామినేడెడ్‌ పదవులను మళ్లీ తమకే కేటాయించాలంటూ ప్రయత్నాలు సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.  

ఆశల పల్లకిలో ఉద్యమకారులు...
తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తూ కేసుల పాలైన పలువురు ఉద్యమకారులు ఈసారి తప్పకుండా నామినేటెడ్‌ పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించినప్పటికీ పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయక పోవడం వల్ల డైరెక్టర్ల పోస్టులు సైతం పార్టీ కింది స్థాయి క్యాడర్‌కు దక్కలేదు. ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్లకు చైర్మన్‌లతో పాటు డైరెక్టర్లను నియమించి అసంతృప్తి వాదులను సంతృప్తి చేయాలన్న దృఢ నిశ్చయంతో అధిష్టానం యోచిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించిన పలువురు నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్తవారికి రాష్ట్ర స్థాయి చైర్మన్‌ పదవులు దక్కుతాయన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. విజయదశమికి కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్‌ పదవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు కొందరు వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top