
నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం సమక్షంలో జరిగిన భేటీలో నిర్ణయం
ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల మంత్రి, టీపీసీసీ అధ్యక్షుడితో ప్రత్యేకంగా భేటీ అయిన రేవంత్
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ, పార్టీపరంగా వ్యవహరించాల్సిన తీరుపై చర్చ
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు వినాయక నిమజ్జనంలోపే పదవు ల బొనాంజా అందనుంది. ఈ మేరకు సెప్టెంబర్ మొదటివారంలోనే కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ భేటీ కంటే ముందు శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి చర్చించారు. ఇప్పటికే జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌ల నుంచి వచ్చిన జాబితా వడపోతను త్వరితగతిన పూర్తిచేసి పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను వినాయక నిమజ్జనం పూర్తయ్యేసరికి ప్రకటించాలని నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన గురించి కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్లపై కూడా నేతలు చర్చించారు. హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు అసెంబ్లీ సమావేశపర్చడం, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకెళ్లడం తదితర అంశాలపై చర్చించిన నేతలు పీఏసీ సమావేశంలో సభ్యుల ముందు ప్రతిపాదించాల్సిన అంశాలు, ఎజెండాపై నిర్ణయం తీసుకున్నారు.
అండగా ఉందాం
ముఖ్య నేతల భేటీ అనంతరం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ గురించి చర్చించేందుకుగాను మరో సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు పాల్గొన్నారు. ఫిరాయింపు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తదనుగుణంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ పలువురు ఎమ్మెల్యేలకు జారీ చేసిన నోటీసులు, పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ జరిగినట్టు సమాచారం.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు నమ్మకంతో వచ్చిన వారికి పార్టీ కూడా అండగా ఉండాలని, ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చించాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, వారికి భరోసా కల్పించడంతోపాటు కేసు విచారణ విషయంలో అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించాలని కూడా సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం.