
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు రాజేసింది. మాజీ మంత్రి , ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌కు అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఆప్కాబ్ ఛైర్మన్ పదవిపై రఘురాం ఆశలు పెట్టుకోగా, ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఆయనకు ఇవ్వకపోవడంపై జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఓ ఫంక్షన్ హాలులో నెట్టెం రఘురాం అనుచరులు, టీడీపీ నేతలు సమావేశమయ్యారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి నెట్టెం రఘురాం పార్టీ కోసం పనిచేశారని.. కేడీసీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించారని.. నేడు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా అవమానపరిచారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. నలభై ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి నెట్టెం రఘురాంకు పదవి ఇవ్వకుండా చేయడం బాధాకరమన్నారు.
‘‘2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం వెనుక నెట్టెం కృషి ఎంతో ఉంది. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట నిలబడిన వ్యక్తి నెట్టెం రఘురాం. రెండు సార్లు పార్టీ గెలుపు కోసం తన సీటును త్యాగం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన మాట మర్చిపోయారు. తక్షణమే రఘురాంకు ఆప్కాబ్ ఛైర్మన్ లేదా రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలి. పార్టీలో సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం’’ అంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పారు.