
నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారిని తొలగించడం సాధ్యం కాదు
సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు
సాక్షి, అమరావతి: పదవీ కాలం ఉన్నప్పటికీ కేవలం రాజకీయ కారణాలతో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారిని తొలగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నామినేటెడ్ సభ్యుల తొలగింపు విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. ప్రకాశం, పశ్చిమ గోదావరి, విజయనగరం, చిత్తూరు జిల్లాల పశుగణాభివృద్ధి సంఘాల (డీఎల్‌డీఏ) జనరల్ బాడీ సభ్యులను రాజీనామా చేయాలంటూ ఆ జిల్లాల కలెక్టర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.
కలెక్టర్లు, పశుసంవర్ధకశాఖ అధికారుల ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం మారడంతో రాజీనామా చేయాలన్న కలెక్టర్లు
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పశుగణాభివృద్ధి సంఘాలకు చైర్‌పర్సన్, డైరెక్టర్లు, సభ్యులు నియమితులయ్యారు. వీరందరూ ఐదేళ్ల పాటు ఆ పదవుల్లో కొనసాగవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కార్పొరేషన్లు, బోర్డులు, విద్యాసంస్థలు, స్వతంత్ర సంస్థల నామినేటెడ్ చైర్‌పర్సన్లు, డైరెక్టర్లు, సభ్యుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ గత ఏడాది జూన్‌లో ఓ నోట్ పంపింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లను కోరుతూ అదే నెలలో మెమో జారీ చేసింది.
ప్రభుత్వ నోట్, మెమోల ఆధారంగా అన్ని జిల్లాల పశుగణాభివృద్ధి సంఘాల చైర్‌పర్సన్, డైరెక్టర్లు, సభ్యులను రాజీనామా చేయాలంటూ కలెక్టర్లు, పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ చిత్తూరు డీఎల్‌డీఏకు చెందిన సంతోష్ కుమార్, ప్రకాశం డీఎల్‌డీఏకు చెందిన కోసూరి రాధా, పశ్చిమ గోదావరికి చెందిన పసల కనక సుందరరావు, మరో ఐదుగురు, విజయనగరానికి చెందిన బెల్లాన బంగారునాయుడు తదితరులు హైకోర్టులో గత ఏడాది వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ చర్యలను సమర్థిస్తూ పిటిషన్లను కొట్టేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. అప్పిలేట్ల తరఫున జి.రామగోపాల్, హరిశ్రీధర్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
‘ప్రభుత్వం మారినంత మాత్రాన ఇష్టానుసారం తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ప్రస్తుత కేసులో నామినేటెడ్ సభ్యులను నియమించే అధికారం కలెక్టర్‌కి ఉంది. అయితే చట్ట నిబంధనలు, బైలా ప్రకారం పదవీ కాలం ముగియడానికి ముందే ఆ సభ్యులను తొలగించే అధికారం మాత్రం కలెక్టర్‌కు లేదు. ప్రత్యేక అధికారం లేకుండా డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ (ఇష్టానుసారం తొలగింపు) సిద్ధాంతాన్ని ఉపయోగించి నామినేటెడ్ సభ్యులను తొలగించలేరు.
ఇలా తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి, కలెక్టర్‌కు చట్టం ఇవ్వలేదు. అందువల్ల ఆయా జిల్లాల పశుగణాభివృద్ధి సంఘాల జనరల్ బాడీ సభ్యులను తొలగిస్తూ కలెక్టర్లు, ఇతర అధికారులు జారీ చేసిన ఆదేశాలు చెల్లవు’ అని ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పేర్కొంది.