‘కంటి వెలుగు’కు ఏర్పాట్లు

Arrangements Of The Kanti Velugu Program - Sakshi

ఆగస్టు 15 నుంచి కంటి పరీక్షలు

13 బృందాల ఆధ్వర్యంలో  నిర్వహణ

జిల్లాకు 4.09 లక్షల కళ్లద్దాలు

జనగామ: సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పేరిట జిల్లా వ్యాప్తంగా గతంలో పెద్ద ఎత్తున వైద్య పరీక్షలను నిర్వహించారు. అంధులు లేని రాష్ట్రం చేయాలనే తలంపుతో సీఎం కేసీఆర్‌ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

‘కంటి వెలుగు’ పేరుతో ఆగస్టు 15 నుంచి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయనున్నారు. జిల్లాలో 40 శాతం మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5,82,485 జనాభా ఉంది.

ఇందులో రూరల్‌ పరిధిలో 5,33,746, అర్బన్‌లో 48,739 జనాభా ఉంది.జీ జనాభాలో 0-5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు 12 శాతం, మరో 8 శాతం మంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని భావిస్తున్నారు. మిగతా 80 శాతం మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ప్రతి రోజు 750 మందికి పరీక్షలు చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలను రూపొందించారు.

ప్రస్తుత జనాభాలో జనాభాలో 30 నుంచి 50 శాతం మంది కంటి సమస్యలతో బాధపడే వారు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసుకుంటున్నారు. ఈ లెక్కన జనగామ జిల్లాలో 2 లక్షల మందికి పైగా మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

రెండు నెలల్లో పరీక్షలు పూర్తి..

కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 4.09 లక్షల అద్దాలు చేరుకున్నాయి. రెండు నెలల వ్యవధిలో కంటి పరీక్షలను పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారు. వెద్యులు కంటి పరీక్షలు చేసిన అనంతరం ప్రాథమిక స్థాయి, దూర, దగ్గరి చూపు ఉన్నవారికి అక్కడికక్కడే కళ్ల అద్దాలను అందిస్తారు.

వైద్య పరీక్షలను చేసిన వారి వివరాలను ఆన్‌లైన్‌లో వెంట వెంటనే నమోదు చేస్తారు. కళ్లలో నరం వల్ల అంధత్వం, మోతి బిందు, నల్ల పాపపై పొర, నీటి కాసులు తదితర సమస్యలు ఉన్న వారికి హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సలు చేస్తారు.

నోడల్‌ ఆఫీసర్‌గా విక్రమ్‌కుమార్‌..

కంటి వెలుగుల కోసం 13 ప్రత్యేక బృందాలనే ఏర్పాటు చేశారు. 13 ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని అర్బన్‌ పీహెచ్‌సీ ద్వారా కంటి పరీక్షలను చేస్తారు. క్యాంపు టీంలు(13), సబ్‌ సెంటర్లు (115), ఏఎన్‌ఎంలు(119), ఆశ కార్యకర్తలు (557), హెల్త్‌ సూపర్‌ వైజర్లు (63), పారామోడికల్‌ ఆఫ్తాల్మిక్‌(13), మెడికల్‌ ఆఫీసర్లు(13), ఆర్‌బీఎస్‌కే (16) బృందాల ద్వారా ఆయా గ్రామాల్లో కంటి పరీక్షలను నిర్వహిస్తారు. బృందంలో డాక్టర్, సూపర్‌ వైజర్, ఆఫ్తాల్మిక్, ఏఎన్‌ఎం, ఆశ, ఇద్దరు డాడా ఎంట్రీలు ఉంటారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌గా స్టేట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విక్రమ్‌కుమార్‌ను నియమించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top