తుంగభద్ర పరవళ్లు!  | Sakshi
Sakshi News home page

తుంగభద్ర పరవళ్లు! 

Published Sat, Jun 16 2018 1:47 AM

Approximately 48 thousand cusecs flow in Tungabhadra River - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సైతం ప్రాజెక్టులోకి 48,410 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు మట్టం శుక్రవారం ఉదయానికి 11.91 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్‌లో మొత్తంగా ప్రాజెక్టులోకి 10 టీఎంసీల నీరు చేరినట్టయింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం 0.93 టీఎంసీల నిల్వలు ఉండగా, ఈ ఏడాది 11 టీఎంసీల మేర అధికంగా నీరు ఉండటం రాష్ట్ర ఆశలను సజీవం చేస్తోంది.

తుంగభద్రలో కనిష్టంగా మరో 80 టీఎంసీల నీరు చేరితే దిగువ శ్రీశైలానికి వరద ఉంటుంది. ప్రతి ఏడాది ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌లో ముందుగా నిండితే తుంగభద్ర మాత్రం నవంబర్‌ నాటికి గానీ నిండేది కాదు. కానీ ఈ ఏడాది దానికి విరుద్ధంగా తుంగభద్రలోకి ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇంతవరకు ఆల్మట్టిలోకి చుక్క కొత్త నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, కేవలం 22 టీఎంసీల నిల్వలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 12 టీఎంసీల నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. 

నారాయణపూర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు 
నారాయణపూర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 2వేల క్యూసెక్కుల మేర నీరు వస్తుండగా ప్రాజెక్టు నీటి నిల్వలు 37.65 టీఎంసీలకు గానూ 24.45 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్‌లోనే ఇక్కడ 5.26 టీఎంసీల కొత్త నీరు చేరింది. జూరాలకు ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 2,087 క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గానూ 5.26 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్‌లోకి 2,365 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ఇక్కడ 312 టీఎంసీలకు గానూ 134.32 టీఎంసీల నీటి లభ్యత ఉంది. గతేడాది ఇదే సమయానికి సాగర్‌లో 118.49 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 16 టీఎంసీల మేర ఎక్కువ నీటి లభ్యత ఉండటం విశేషం.

ఎస్సారెస్పీలో కొనసాగుతున్న ప్రవాహాలు..
ఇక ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం సైతం ప్రాజెక్టులోకి 12,784 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 10.39 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీకి ఈ సీజన్‌లో కొత్తగా 3.91 టీఎంసీల మేర నీరు వచ్చింది. ఇక సింగూరులోకి 1,453 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాని నిల్వ 29.9 టీఎంసీలకు గానూ 7.93 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు ప్రవాహాలు తగ్గాయి. నిన్నమొన్నటి వరకు వేల క్యూసెక్కుల నీరు రాగా, అది ప్రస్తుతం వందలకు పడిపోయింది. కడెంలోకి 181 క్యూసెక్కులు, ఎల్లంపల్లిలోకి 952 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement