వివాహితపై కన్నేసి.. ఆమె భర్తను హతమార్చేందుకు..

Apollo Employee Trapped A Woman And Tried To Kill Her Husband In Hyderabad - Sakshi

వివాహితపై కన్నేసిన కామాంధుడు      

భర్త అడ్డు తొలగించేందుకు సుపారి  

బెడిసికొట్టిన పథకం.. నిందితుడి అరెస్టు 

బంజారాహిల్స్‌ : ఇబ్బందుల్లో ఉన్న ఓ వివాహిత అవసరాలను ఆసరాగా చేసుకొని ఆమెపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమె భర్తను హతమార్చేందుకు సైతం కుట్రపన్ని పోలీసులకు చిక్కిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14 వెంకటేశ్వరనగర్‌ కమ్యూనిటీ హాల్‌ ప్రాంతానికి చెందిన మాల్యాద్రి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో స్పెషల్‌ క్వాలిటీ మెయింటెనెన్స్‌ విభాగంలో పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది సెప్టెంబర్‌ 2న శ్రీకృష్ణానగర్‌కు చెందిన ఓ వివాహిత, తన భర్త జారిపడటంతో కాలు విరిగిపోగా అంబులెన్స్‌ కోసం అపోలో ఆస్పత్రికి ఫోన్‌ చేసింది. ఆ సమయంలో ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన మాల్యాద్రి అంబులెన్స్‌తో పాటు అక్కడికి వచ్చాడు.

అప్పటినుంచి ఆమెతో పరిచయం పెంచుకున్న అతను ప్రతి రోజూ ఫిజియోథెరపిస్ట్‌ను తీసుకొచ్చి సదరు యువతి భర్తకు మసాజ్‌లు చేయిస్తూ అక్కడే ఎక్కువసేపు గడిపేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెస్సీ నర్సింగ్‌తో పాటు మూడు పీజీలు చేసిన మీ భార్యకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె భర్తకు చెప్పాడు. వివరాలు నమోదు పేరుతో ఆమె ఫోన్‌ తీసుకొని భార్య, భర్తలకు తెలియకుండా ఓ యాప్‌ను క్రియేట్‌ చేశాడు. దీని ద్వారా భార్య, భర్తలు ఏం మాట్లాడుకునేది, ఆమె ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేవాడు. ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పించిన మాల్యాద్రి ఆమెను లోబరచుకునేందుకు భర్తకు ఆమెపై అనుమానాలు కలిగేలా ప్రవర్తించడమేగాక, భర్త పేరుతో ఆస్పత్రికి లేఖలు రాశాడు. నాలుగు రోజుల క్రితం తన భార్యా, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని మనిద్దరి మధ్య వివాహేతర సంబంధం తెలిసిపోయిందని వివాహితకు చెప్పడంతో ఆమె భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది. శాశ్వతంగా ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న అతను నందినగర్‌కు చెందిన రామారావు అనే వ్యక్తిని కలిసి గత శుక్రవారం ఆమె భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు.

అయితే సదరు వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దీనిపై ఆరా తీసిన పోలీసులు గడిచిన ఎనిమిది నెలలుగా సదరు దంపతుల మానసిక వేదనను తెలుసుకున్నారు. నిందితుడు మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె భర్తను హత్య చేసి ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవాలని పథకం వేసినట్లు చెప్పాడు. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్‌ ఇచ్చినట్లు అంగీకరించాడు. ఒకవేళ హత్యాపథకం పారకపోతే అతడిని మంచానికే పరిమితం చేసి ఆమెను శాశ్వతంగా తనతో పాటు ఉంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. అతని పాచిక పారకపోవడంతో పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 354, 354(ఏ), 469, 506, 509 కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top