హైదరాబాద్‌లోని ఏపీ కార్యాలయాలు తెలంగాణకు

AP Buildings in Hyderabad Hand Over to Telangana Govt - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకోవడం కోసం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను చెరిసగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుంచి నడుస్తున్నందున హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ భవనాలను వాడుకోనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఉపయోగంలో లేకపోవడం వల్ల భవనాలు పాడవుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలను తమ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అభ్యర్థించింది. గవర్నర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తమకు ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విజ్ఞప్తిపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.

కేసీఆర్‌ హర్షం
గవర్నర్‌ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలే పరమావదిగా, స్నేహ భావంతో ముందడుగు వేయడం శుభపరిణామని పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు ప్రభుత్వాలు పని చేయాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతని కేసీఆర్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top