ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలి 

Any state employees must work within that state - Sakshi

విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు 

సాక్షి, హైదరాబాద్‌: స్థానికత ప్రతిపాదికన ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలని, ఒక వేళకాదని ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో విలీనం చేయాలని చూస్తే మలిదశ తెలంగాణ పోరాటానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్, తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్, తెలంగాణ విద్యుత్‌ ఎకౌంట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌లు కోరాయి. సమస్య జటిలం కాకముందే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తుది నిర్ణయానికి రావాలని అల్టిమేటం జారీ చేశాయి.

ఈ మేరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌. శివాజీ, మధుసూదన్‌ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు అంజయ్య సంయుక్తాధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డ జెన్‌కో ఆడిటోరియంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇదే అంశంపై తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు, కార్యదర్శి సదానందం అధ్యక్షతన ఆ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి, తీర్మా నం ప్రతిని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధు లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఏపీ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను ఆప్షన్ల పేరుతో తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందని, ఏపీ ప్రతిపాదనను తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని వారు స్పష్టం చేశారు. ఏపీ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో చేర్చుకున్నట్లే.. ఆంధ్ర స్థానికత గల 1157 మంది విద్యుత్‌ ఉద్యోగులను ఏపీ విద్యుత్‌ సంస్థల్లో చేర్చుకోవాలన్నారు. తమ అభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే..వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కిరణ్‌కుమార్, వెంకటనారాయణ, జనప్రియ, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top