ఫిర్యాదులున్న సిబ్బందిపైనా వేటు ∙అవినీతి ఆరోపణలుంటే నాన్–ఫోకల్‌కు...
మిత్తల్ సిఫార్సులకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్
త్వరలో మార్గదర్శకాలు.. ఏప్రిల్‌కల్లా బదిలీలు
విద్యుత్ ఉద్యోగులకు షాక్
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. రెండేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న వారిని నాన్–ఫోకల్ పోస్టుల్లోకి మార్చాలని భావిస్తోంది. అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతున్న వారినీ దూర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపినట్టు తెలిసింది. ప్రభుత్వం దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
బదిలీలకు సంబం«ధించిన మార్గదర్శకాలను త్వరలోనే రూపొందించాలని, మార్చిలోపే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ శాఖలో బదిలీలు చేపట్టలేదు. ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు వీలుగా ప్రభుత్వానికి సిఫార్సులు పంపారు.
త్వరగా వివరాలు ఇవ్వండి
ఉద్యోగుల సమగ్ర వివరాలను ఇంధన శాఖ కార్యాలయం సేకరిస్తోంది. ఏ ఉద్యోగి ఎక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు? గతంలో ఎక్కడెక్కడ పనిచేశాడు? ఎలాంటి ఫిర్యాదులున్నాయి? ఇందులో వృత్తిపరమైన నిర్లక్ష్యం... డబ్బులు డిమాండ్ చేస్తున్నవి... స్థానికంగా ఉండటం లేదని వస్తున్న ఫిర్యాదులను వేర్వేరుగా ఇవ్వాలని సంబంధిత అధికారులను ఇంధన శాఖ కోరింది.
జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులను ఈ వివరాలు కోరారు. వాస్తవానికి మూడేళ్లు ఒకేచోట పనిచేస్తే బదిలీ చేసే అవకాశం ఉంటుంది. దీనిని రెండేళ్లకు కుదించాలని నిర్ణయించారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలు వెళ్లాయి. జెన్‌కో ప్లాంట్లు, ట్రాన్స్‌కోలో ఫీల్డ్ సిబ్బంది విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని అనుకుంటున్నారు.
అయితే, స్కిల్డ్ పోస్టులైన ఇంజనీర్లు ప్లాంట్లల్లో పోస్టింగ్‌లు పొంది, డిప్యూటేషన్‌పై హైదరాబాద్ జెన్‌కో కార్యాలయంలో పనిచేస్తున్న వారి వివరాలను పరిశీలిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని తిరిగి ప్లాంట్లకే పంపే యోచనలో ఉన్నారు.
అవినీతే ప్రధాన కారణం
ఆరు నెలలుగా విద్యుత్ సిబ్బందిపై 3,841 ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఇందులో విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బందిపైనే ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం మొదలుకొని, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి వరకూ భారీగా లంచాలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదుల్లో ఉంది. వ్యవసాయ ఉచిత విద్యుత్ పొందే రైతుల వద్ద కూడా ముడుపులు తీసుకోవడం అధికారుల దృష్టికి వచ్చింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పారిశ్రామిక సంస్థల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల అవినీతి నిరోధక శాఖ దాడుల్లోనూ కొంతమంది డీఈ, ఏఈ స్థాయి అధికారులు పట్టుబడ్డారు. వారి ఆస్తుల చిట్టాలు భారీగా ఉండటాన్ని ఏసీబీ గుర్తించింది. కొన్నిచోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.
విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ కింద వేరేవాళ్లను నియమించుకొని విధులకు హాజరవ్వని ఉదంతాలు అధికారుల దృష్టికి వచ్చాయి. ఇవన్నీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఇటీవల సీఎం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి నిఘా, ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.
మీరే కాపాడాలి...
వ్యక్తిగత వివరాలపై ఉన్నత స్థాయిలో దృష్టి పెట్టడంతో విద్యుత్ పంపిణీ సిబ్బంది రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక నేతల ఆశీస్సులతో, పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చి పోస్టులు పొందిన వారిలో గుబులు మొదలైంది. ఎలాగైనా ఉన్న చోటును కాపాడుకునేందుకు బేరసారాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వైరిపక్షం కుట్ర పూరితంగా ఫిర్యాదులు ఇచ్చారని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. మరికొంత మంది విద్యుత్ ఉన్నతాధికారుల సాన్నిహిత్యంతో ఫోకల్ పోస్టులు పొందారు. వారంతా అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాల పరిధిలో ఇలాంటి ఫైరవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.


