నీటి బొట్టు.. ఒడిసి పట్టు! | Anil jain on Agriculture | Sakshi
Sakshi News home page

నీటి బొట్టు.. ఒడిసి పట్టు!

Dec 1 2017 1:48 AM | Updated on Jun 4 2019 5:04 PM

Anil jain on Agriculture - Sakshi

చిన్న కమతాలు.. పెరుగుతున్న పెట్టుబడులు.. రాబడుల లేమి.. వంటి ఎన్నో సమస్యలు భారత్‌లో రైతును అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడం కష్టమేమీ కాదంటున్నారు దేశంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన జైన్‌ ఇరిగేషన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ జైన్‌. వ్యవసాయ రంగం సవాళ్లు.. పరిష్కారాలు అన్న అంశంపై ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించేందుకు వచ్చిన అనిల్‌జైన్‌తో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ..     – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

ప్రశ్న: దేశంలో వ్యవసాయ పరిస్థితి, ఎదుర్కొంటున్న సవాళ్లపై మీ అభిప్రాయం?
జవాబు: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలని కేంద్రం అంటోది. అయితే దేశంలోని రైతులందరి పరిస్థితి ఒకేలా లేదు. వీరి ఆదాయాన్ని పెంచడం ఓ సవాలు. ముందు వారికి సాగునీరు అందించాలి. అందువల్ల రెండు పంటలు వేసుకోవచ్చు. దీంతో పాటు వాణిజ్య పంటల సాగు చేసుకోవచ్చు. పేద రైతులకు మంచి విత్తనాలు, మొక్కలు, ఎరువులు అందించడం ఇంకో సవాలు. ఉత్పత్తులను మార్కెట్‌తో అనుసంధానించడం కీలకం. రైతు స్వయంగా పంట ఉత్పత్తుల ప్రీప్రాసెసింగ్‌ చేపట్టాలి.

ప్ర: వర్షాలు పడని చోట్ల నీరందించడం ఎలా?
జ: అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వాడుకునేలా చూడాలి. పొలాల వరకూ నీటిని తీసుకొచ్చేందుకు ప్రస్తుతం డ్యామ్‌లు, కాల్వలు ఉపయోగిస్తున్నాం. వీటికి బదులు పైపుల ద్వారా తీసుకొచ్చి.. డ్రిప్, మైక్రో ఇరిగేషన్ల ద్వారా నీటిని 90 శాతం సమర్థంగా వాడుకోవచ్చు. దీంతో దిగుబడులు 30 నుంచి 40 శాతం పెరుగుతాయి.. రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది.

ప్ర: మిగిలిన విషయాల మాటేమిటి?
జ: లీటర్‌ నీటితో ఏం పండిస్తున్నాం.. ఎంత పండిస్తున్నాం అన్నదీ ముఖ్యమే. ఓ పది లీటర్ల నీటి వాణిజ్య విలువ (వాటర్‌ ఫ్యాక్టర్‌ ప్రోడక్టివిటీ) ఎంతన్నది చూడాలి. ఈ అంశంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మేం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశాం. ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌ టెక్నాలజీ వాడకానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలకే సెన్సర్లను జోడించి మొక్కల వేళ్ల వద్ద తేమ శాతాన్ని గుర్తిస్తున్నాం.

ప్ర: పాశ్చాత్యదేశాల్లో వర్టికల్‌ ఫార్మింగ్‌పై...
జ: తగినంత వైశాల్యంలో 50 నుంచి 80 అంతస్తుల నిర్మాణాల్లో వర్టికల్‌ ఫార్మింగ్‌ చేస్తే 5 లక్షల ఎకరాలకు సమానమైన పంట సాధిం చొచ్చు. ఈ పద్ధతిలో 98% తక్కువ నీటితోనే బాగా పండించొచ్చు. కానీ, పెట్టుబడి ఎక్కు వ. ఒకట్రెండు ప్రాజెక్టులు మినహా దేశంలో వర్టికల్‌ ఫార్మింగ్‌ అవసరం లేదు.

ప్ర: వ్యవసాయంలో టెక్నాలజీ వాడకానికి చిన్న కమతాలు అడ్డంకి కదా..
జ: ఈ సమస్యను అధిగమించేందుకు మేం ఫుడ్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీవో)తో కలసి పనిచేస్తున్నాం. కొంతమంది రైతులు ఒకే వేదికపైకి వస్తారు కాబట్టి ఈ ఎఫ్‌పీవోల ద్వారా వ్యవసాయంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడం సులువు అవుతుంది. ఈ విషయంలో టాటా కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ సాయంతో ఓ ప్లాట్‌ ఫార్మ్‌ను సిద్ధం చేస్తున్నాం. ఇది ఎఫ్‌పీవో రైతులు తమ సమస్యలను మొబైల్‌ఫోన్ల ద్వారా కూడా వారి మాతృభాషలోనే శాస్త్రవేత్తలకు తెలియజేసే వీలు కల్పిస్తుంది.

ప్యాకెట్లలో పండ్ల ముక్కలు..
పళ్ల రసాల తయారీలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న జైన్‌ ఇరిగేషన్‌ సంస్థ త్వరలోనే పండ్ల ముక్కలను ప్యాకెట్లలో అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చక్కెర, నీరు, ఏ రసాయనాలు లేకుండా 5 రకాల పండ్లు, మిశ్రమాలు అందిస్తా మని అనిల్‌ జైన్‌ తెలిపారు. మార్చి లోపు మామిడితో పాటు యాపిల్, అరటి మిశ్రమం, స్ట్రాబెర్రీ, అరటి మిశ్రమం వంటి పండ్ల ముక్కలను నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement