రెవె‘న్యూ’ లుక్‌ వచ్చేనా!

After KCR Meet With Officials Chance To Get Clarity About New Revenue Act - Sakshi

అధికారులతో సీఎం భేటీ తర్వాత కొత్త చట్టంపై స్పష్టత

ఇప్పటికే కసరత్తుమొదలుపెట్టిన రెవెన్యూ శాఖ

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు!

రెవెన్యూ కోడ్‌ లేదా టైటిల్‌ గ్యారంటీపై తేల్చుకోలేని సర్కారు

ఉద్యోగుల విలీనంపైనే అభ్యంతరం అంటున్న సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త రెవెన్యూ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని సీఎం చేసిన ప్రకటనతో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. గతేడాది లోక్‌సభ ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన రైతుతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. త్వరలోనే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తరచూ ప్రస్తావిస్తున్నా.. ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అయితే, చట్ట రూపకల్పన కోసం రెవెన్యూ ఉన్నతాధికారులతో సీఎం త్వరలోనే భేటీ అవుతారని, ఆ తర్వాత స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవినీతి శాఖగా అపఖ్యాతిని మూటగట్టుకున్న రెవెన్యూను సంపూర్ణంగా సంస్కరించాల్సిన అవసరముందని గత అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టానికి ఆమోదముద్ర వేస్తామని తేల్చి చెప్పారు. చట్టాలపై సమాచారం: రెవెన్యూ వ్యవస్థకు సత్వర చికిత్స, కొత్త చట్టానికి రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలతో పాటు, కొత్త చట్టంలో ఎలాంటి సంస్కరణలు తేవాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారం సేకరించింది. ఇనామ్, అసైన్డ్, రక్షిత కౌలుదారు, ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర కేటగిరీల భూములకు సంబంధించి చట్టాల అవశ్యకతపై ఇప్పటికే నివేదికలు కూడా తెప్పించుకుంది. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనకు వివిధ మార్గాల్లో అభిప్రాయసేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్‌ విశ్వవిద్యాలయం న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరిపింది.

ఒకే గొడుగు కిందకు..
ఇప్పటివరకు మనుగడలో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు, కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నిర్దేశించిన టైటిల్‌ గ్యారంటీ చట్టం అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏపీ ఒకడుగు ముందుకేసి ఈ చట్టానికి ఆమోదముద్ర వేయడంతో ఇదే తరహా చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే దిశగా ఆలోచన చేస్తోంది. అయితే, ఈ చట్టం అమలు అనుకున్నంత సులువు కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

తెలంగాణ ల్యాండ్‌రెవెన్యూ కోడ్‌
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్‌ రెవెన్యూ కోడ్‌–2019ను ప్రవేశపెట్టాలనే వాదన రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కోడ్‌తో ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానే ఒకే చట్టం మనుగడలోకి రానుంది. ఈ రెండింటితో పాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్‌ రెవెన్యూ చట్టం–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్దగా చట్ట స్ఫూర్తి దెబ్బతినకుండా కొత్త చట్టానికి తుదిరూపు ఇవ్వాలనే కోణంలోనూ ఆలోచన చేస్తోంది.

ఉద్యోగుల్లో గడబిడ!
రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వీఆర్వో, వీఆర్‌ఏల సేవలు చాలించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన, ఆన్‌లైన్‌ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేయడంతో వీరిని ఇతర సేవలను మళ్లించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఎవరి కొలువులకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఉద్యోగవర్గాల్లో కనిపిస్తోంది. అయితే, కొత్త చట్టం తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ తమపై అవినీతిపరులంటూ అపప్రద మోపి చట్టం చేస్తామనడం సరికాదని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. బహుళ ప్రజానీకంతో సంబంధమున్న శాఖ కావడంతోనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి తప్ప శాఖ పూర్తిగా అవినీతిమయం కాలేదని చెబుతున్నాయి. ఎన్నికల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు తాము అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగితే బాగుంటుదనేది రెవెన్యూ సంఘాల వాదనగా కనిపిస్తోంది.

శాఖతో సంబంధం లేని పనులను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూడకుండా రెవెన్యూ శాఖ అభివృద్ధి చెందేలా ప్రజలకు సరళతర సేవలందించేలా చట్టం తీసుకొస్తే తామే స్వాగతిస్తామంటున్నారు. అయితే, ఈ విషయంలో తమ సేవల గురించి ప్రభుత్వ పెద్దలకు సానుభూతితో వివరించాల్సిన ఐఏఎస్‌ అధికారులు అన్ని విధులు చేయించుకుంటూనే అనుసంధానకర్తలుగా వ్యవహరించకపోవడం బాధాకరమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త చట్టం ఎలా ఉంటుంది.. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగ వర్గాలకు అనుకూలంగా ఉంటుందా.. ఏకపక్షంగా ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. 

ఉద్యోగుల్లో గడబిడ!
రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వీఆర్వో, వీఆర్‌ఏల సేవలు చాలించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన, ఆన్‌లైన్‌ ఆధారిత వ్యవస్థను పటిష్టం చేయడంతో వీరిని ఇతర సేవలకు మళ్లించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం ఎవరి కొలువులకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఉద్యోగవర్గాల్లో కనిపిస్తోంది. అయితే, కొత్త చట్టం తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ తమపై అవినీతిపరులంటూ అపప్రథ మోపి చట్టం చేస్తామనడం సరికాదని రెవెన్యూ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. బహుళ ప్రజానీకంతో సంబంధమున్న శాఖ కావడంతోనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి తప్ప శాఖ పూర్తిగా అవినీతిమయం కాలేదని చెబుతున్నాయి. ఎన్నికల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు తాము అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగితే బాగుంటుందనేది రెవెన్యూ సంఘాల వాదనగా కనిపిస్తోంది.

శాఖతో సంబంధం లేని పనులను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూడకుండా రెవెన్యూ శాఖ అభివృద్ధి చెందేలా ప్రజలకు సరళతర సేవలందించేలా చట్టం తీసుకొస్తే తామే స్వాగతిస్తామంటున్నారు. అయితే, ఈ విషయంలో తమ సేవల గురించి ప్రభుత్వ పెద్దలకు సానుభూతితో వివరించాల్సిన ఐఏఎస్‌ అధికారులు అన్ని విధులు చేయించుకుంటూనే అనుసంధానకర్తలుగా వ్యవహరించకపోవడం బాధాకరమని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త చట్టం ఎలా ఉంటుంది.. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగ వర్గాలకు అనుకూలంగా ఉంటుందా.. ఏకపక్షంగా ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top