విధుల్లో విఫలమైతే వేటు | Action Against Government Officials For Neglecting Corona Control | Sakshi
Sakshi News home page

విధుల్లో విఫలమైతే వేటు

Apr 23 2020 1:44 AM | Updated on Apr 23 2020 4:31 AM

Action Against Government Officials For Neglecting Corona Control - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం, లాక్‌డౌన్‌ అమలులో నిర్లిప్తత వహించే అధికారులపై సర్కారు కొరడా ఝుళిపిస్తోంది. కరోనాపై పోరులో కఠినంగా వ్యవహరించని అధికారులపై చర్యలు చేపడుతోంది. కారణాలు బయటకు వెల్లడించకపోయినా మొన్నటికి మొన్న గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్, కింగ్‌కోఠి సూపరింటెండెంట్‌ను మార్చేసిన సర్కారు.. తాజాగా సూర్యాపేట డీఎస్పీ, ఆ జిల్లా వైద్యాధికారిపై బదిలీ వేటు వేసింది. వికారాబాద్‌ జిల్లాలో వివిధ రంగాలకు చెందిన అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో నగర డీఎంహెచ్‌వో అధికారాలను కత్తిరిస్తూ 30 సర్కిళ్లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి సర్కిల్‌కు ఒక డీఎంహెచ్‌వో స్థాయి అధికారాలున్న వారిని నియమించింది.

‘గాంధీ’లో వివాదాలతో: రాష్ట్రంలో కరోనా కేసుల చికిత్సలో అత్యంత కీలక కేంద్రంగా గాంధీ ఆసుపత్రే ఉంది. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న వారంతా గాంధీలోనే ఉన్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రభుత్వం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆగమేఘాల మీద ఎందుకు మార్చిందన్న అంశంపై వైద్య, ఆరోగ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెల క్రితం గాంధీ ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్‌ పెట్రోల్‌ బాటిళ్లను చుట్టుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. అలాగే మొదట్లో కరోనా కేసు నమోదు కాకపోయినా రెండు పాజిటివ్‌లు వచ్చినట్లు లీక్‌ అయింది. ఆ తర్వాత తమకు రక్షణ కిట్లు లేవంటూ జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఇటీవల కొందరు ఔట్‌సోర్సింగ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కూడా సమ్మె నోటీసులు ఇచ్చారు. అంతేగాక ఇటీవల కొందరు కరోనా రోగులు భోజన వసతులు సరిగా లేవంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ పరిణామాలన్నింటినీ సకాలంలో డీల్‌ చేయలేకపోయారన్న భావనతోనే సర్కారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటుకు దారితీసిందన్న ప్రచారం జరుగుతోంది.

నిర్లక్ష్యం కారణంగా...
రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదుకాగా సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. సూర్యాపేటలోనైతే కేసుల సంఖ్య ఏకంగా 83కు చేరుకోవడంతో సర్కారు అప్రమత్తమైంది. గద్వాల, వికారాబాద్‌లలోనూ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆ మూడు జిల్లాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావులు బుధవారం ఆగమేఘాల మీద సుడిగాలి పర్యటన చేశారు.

స్థానిక అధికారుల నిర్లక్ష్యం కూడా కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. అందుకే సూర్యాపేట డీఎస్పీ, ఆ జిల్లా వైద్యాధికారిపై బదిలీ వేటు వేశారని, వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదని సమాచారం. సకాలంలో స్పందించకపోవడంతో వైద్యాధికారిపైనా, లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనందుకు డీఎస్పీపైనా వేటు వేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే గద్వాల డీఎస్పీపైనా అటువంటి ఆరోపణలే వచ్చినట్లు సమాచారం. లాక్‌డౌన్‌ విధించినా సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందనేది సర్కారు భావన. చదవండి: కరోనాను మించిన వైరస్


రాష్ట్రస్థాయిలో నిఘా...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, కరోనా నియంత్రణ, చికిత్స, ఏర్పాట్లపై ఏమాత్రం రాజీపడొద్దని, ప్రజల ప్రాణాలే ముఖ్యమని విస్పష్టంగా ప్రకటించారు. అందుకే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి జరగకుండా చూడాలని అనేకసార్లు సమీక్ష నిర్వహించారు. అలాగే వైద్యులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. అయితే వైద్య, ఆరోగ్యశాఖలో కొందరు రాష్ట్రస్థాయి అధికారులు కూడా నిర్లిప్తంగా వ్యవహరించడంపై ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతోంది. గాంధీ ఆసుపత్రిలో వివిధ సందర్భాల్లో సమస్యలు తలెత్తినా ముందెందుకు పసిగట్టలేదన్న భావన కూడా ఉన్నతస్థాయిలో నెలకొంది. ఒకటికి పదిసార్లు చెప్పినా కొందరు అధికారులు తీరు మార్చుకోకపోవడం, తగిన ఏర్పాట్లు చేయడంలో వేగం ప్రదర్శించకపోవడం ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది.

పూర్తిస్థాయిలో పీపీఈ కిట్లు, ఎన్‌–95 మాస్కులు, ఇతర పరికరాలను తెప్పిస్తున్నా కొరత ఉందంటూ ఎందుకు విమర్శలు వస్తున్నాయని ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడంలో కొందరు అధికారులు విఫలమయ్యారన్న భావన ప్రభుత్వంలో నెలకొంది. ఒకరిద్దరు అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నా కొందరు కరోనా పోరులో నామమాత్రంగా ఉంటున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఎక్కడేం జరుగుతోందో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కరోనాపై పోరాటంలో అధికారులు ఏమాత్రం కఠినంగా వ్యవహరించకపోయినా, నిర్లిప్తంగా ఉన్నా వేటు తప్పదని ప్రస్తుత సంకేతాలు తెలియజేస్తున్నాయని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.   చదవండి: వ్యవస్థల ప్రక్షాళన అనివార్యం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement