సిటీ సూపర్‌ మార్కెట్‌ అబిడ్స్‌ షాప్‌ | Sakshi
Sakshi News home page

సిటీ సూపర్‌ మార్కెట్‌ అబిడ్స్‌ షాప్‌

Published Tue, Feb 20 2018 8:37 AM

abids name comes with supermarket Albert Abids and Co shop - Sakshi

సాక్షి, సిటీబ్యూరో  : నేడు మనం చూస్తున్న సూపర్‌ మార్కెట్లకు నగరంలో 125 ఏళ్ల క్రితమే పునాది పడింది. ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన భాగ్యనగరం... ఆనాడే అన్ని వస్తువులకు కేంద్రంగా నిలిచింది. సూది నుంచి వాకీటాకీ వరకు ఇక్కడ లభించేవి. ఆర్మేనియా దేశస్థుడు అల్బర్ట్‌ అబిడ్స్‌ 1893 ఫిబ్రవరి 20న ‘అల్బర్ట్‌ అబిడ్స్‌ అండ్‌ కో’ పేరుతో దీనిని నెలకొల్పాడు.

అల్బర్ట్‌ అబిడ్స్‌ 1848 జులై 23న ఆర్మేనియాలో జన్మించాడు. వృత్తిరీత్యా వజ్రాల వ్యాపారి అయిన అల్బర్ట్‌... ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు విదేశీ దుస్తులు, ఆభరణాలు, విలువైన వస్తువులు తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో నిజాం రాజుకు స్టైలిస్ట్‌గా మారాడు. ఇక్కడి ప్రజల జీవనశైలిపై అధ్యయనం చేశాడు. దీంతో నగరంలో దేశవిదేశీ వస్తువులతో షాప్‌ నెలకొల్పేందుకు నిజాం అనుమతి తీసుకున్నాడు. అప్పటికి నగరం నడుమ జనరల్‌ పోస్టాఫీస్‌ ప్రాంతంలో ముస్తఫా బజార్‌ కొనసాగుతుంది. అక్కడే ‘అల్బర్ట్‌ అబిడ్స్‌ అండ్‌ కో’ పేరుతో షాప్‌ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు నగరంలో ఆభరణాలు, గడియారాలు, మోటార్‌సైకిళ్లు, స్టేషనరీకి సంబంధించి వేర్వేరు షాపులు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చిందీ షాప్‌. లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు, జ్యువెలరీ, స్టేషనరీ... ఇలా అన్ని రకాల దేశవిదేశీ వస్తువులు ఇందులో లభించేవి. ఇప్పుడున్న సూపర్‌ మార్కెట్లలో మాదిరి ఒక్క పండ్లు, కూరగాయలు మినహా అన్ని ఉండేవి. ఈ షాప్‌ ఏర్పాటుతోనే ఆ ప్రాంతానికి అబిడ్స్‌ అనే పేరొచ్చింది.   

1942 వరకు కొనసాగింపు...  
1911లో మహబూబ్‌ అలీఖాన్‌ మరణించాడు. దీంతో ఆవేదనకు గురైన అల్బర్ట్‌ షాప్‌ను విక్రయించి స్వదేశానికి వెళ్లిపోయాడు. 1914లో ‘స్టేట్‌ టాకీస్‌’ రూ.5లక్షలకు ఈ వ్యాపార సముదాయాన్ని కొనుగోలు చేసింది. స్టేట్‌ టాకీస్‌ రెండేళ్లు కొనసాగించిన అనంతరం... ఇందుభాయ్‌ పటేల్‌ రూ.7 లక్షలకు దీనిని తీసుకున్నారు. 1942 వరకు ఈ షాప్‌ను నడిపించారు.  

వ్యాపార సముదాయ నిర్మాణం...   
1942 తర్వాత ఇందుభాయ్‌ పటేల్‌ దీనిని ప్యాలెస్‌ టాకీస్‌గా మార్చారు. 1974 వరకు ఇది కొనసాగింది. అనంతరం అదే స్థలంలో కొత్తగా రెండు మినీ ప్యాలెస్‌లు నిర్మించి సినిమా హాళ్లను ఏర్పాటు చేశారు. 1996 వరకు ఇవి కొనసాగాయి. తర్వాత వీటిని కూలగొట్టి 2001లో వ్యాపార సముదాయం నిర్మించారు. ఇక్కడే బిగ్‌ బజార్, ఇతర షాపులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇందుభాయ్‌ కుమారుల
అధీనంలో ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement