నీటి బొట్టు వదిలితే ఒట్టు..! | Sakshi
Sakshi News home page

నీటి బొట్టు వదిలితే ఒట్టు..!

Published Fri, Nov 21 2014 1:12 AM

నీటి బొట్టు వదిలితే ఒట్టు..!

  • రీ జనరేట్ వాటర్‌ను కాజేస్తున్న కర్ణాటక
  •   వందల సంఖ్యల్లో వెలసిన అక్రమ లిప్టులు
  •   జూరాల, ఆర్డీఎస్ రిజర్వాయర్లకు చేరని నీరు
  •   ఏటా రబీ పంటలకు నీళ్లందక కష్టకాలం
  •   నేడు బెంగళూరులో తుంగభద్ర బోర్డు భేటీ
  • గద్వాల(మహబూబ్‌నగర్): కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దిగువకు వచ్చే రీ జనరేట్ వాటర్‌ను పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్పనంగా కాజేస్తోంది. వందలకొద్దీ అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా తోడేస్తోంది. దీంతో ఏటా మనరాష్ట్రంలో రబీలో నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధారణంగా రబీ సీజన్‌లో నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల క్రస్టుగేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేయరు. రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఆయకట్టుకు ప్రధానకాల్వ ద్వారా మాత్రమే విడుదల చేస్తారు.

    కాగా, ఈ నీళ్లు పొలాల ద్వారా వాగుల్లో కలిసి తిరిగి నదిలోకి చేరుతాయి. అయితే ఈ నీరు దిగువనున్న జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చేరాల్సి ఉంది. ఎగువ నుంచి దిగువన ఉన్న ప్రాజెక్టు వరకు మధ్యన ఉన్న ప్రాంతంలో తాగునీటి అవసరాలకు మినహా నదిలోకి వెళ్తున్న రీ జనరేట్ వాటర్‌ను ఎత్తిపోతల పథకాలతో కాజేయడానికి అవకాశం లేదు. కానీ కర్ణాటకలో వందల సంఖ్యలో మినీ ఎత్తిపోతలతో తోడేస్తున్నారు.
     
    విచ్చలవిడిగా నీటి తోడివేత

    తుంగభద్ర నీటిని రబీ సీజన్‌లో కర్ణాటక, రాయలసీమలోని ఆయకట్టుకు విడుదల చేస్తారు. ఆయకట్టుకు పారిన నీళ్లు పొలాల ద్వారా తిరిగి తుంగభద్రలోకి చేరతాయి. ఆ నీరు కర్ణాటకలోనే ఉన్న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వరకు చేరకుండానే దాదా పు 130 మినీ ఎత్తిపోతల పథకాలతో సాగుతో పాటు, పరిశ్రమలకు, చేపల చెరువులకు వినియోగిస్తున్నారు. వాస్తవంగా ఈ నీటిని  తాగు అవసరాలకే వాడాల్సి ఉంది.
     
    తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ మధ్య 40కి పైగా మినీ ఎత్తిపోతల పథకాలు, మినీ జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించారు. నికర జలాలను పై ప్రాంతంలో సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా వాడేందుకు అనుమతి లేకున్నా పంప్‌సెట్లతో వందలాది ఎకరాల్లో చేపల చెరువులను నదికి రెండువైపులా ఏర్పాటు చేశారు. దీనికి మన ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. నదిపై 35 పైగా చిన్నసామూహిక లిఫ్టులు ఏర్పాటు చేశారు.
     
    కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మితమైన నారాయణపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిని దాదాపు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీ సీజన్‌లో కర్ణాటక ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆయకట్టుకు విడుదలైన నీళ్లు పొలాలకు వెళ్లి మిగిలిన నీళ్లు తిరిగి నదిలోకి చేరతాయి. నారాయణపూర్ ఆయకట్టు నుంచి మనరాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మధ్యలో 80 వరకు మినీ ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు విడుదలైన నీటిలో రెండు టీఎంసీల నీటిని కర్ణాటకలో అవసరాలకు వినియోగించుకుని మిగతాది జూరాలకు వెళ్లేలా చూడాలి. కానీ, కర్ణాటకలో  అక్రమ ఎత్తిపోతల ద్వారా ఆరు టీఎంసీల నీటిని వాడేస్తున్నారు.
     
    నేడు బెంగళూరులో తుంగభద్ర బోర్డు భేటీ

    ఈ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం బెంగుళూరు తుంగభద్ర నది బోర్డు చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. బోర్డులో ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున కర్నూలు జిల్లా ప్రాజెక్టుల ఎస్‌ఈ మాత్రమే పాల్గొనేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో మొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల ఇన్‌చార్జి సీఈ ఎస్.ఖగేందర్ బోర్డు సమావే శంలో పాల్గొననున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాతో పాటు కర్ణాటకలో ఈ రెండు నదులపై నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాలపై ప్రస్తావించనున్నారు.

Advertisement
Advertisement