నైరుతి సాధారణమే

96 Percent Of Rainfall Is Estimated Says - Sakshi

రైతులకు ఆశాజనకంగా వానాకాలం.. 

96 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా 

జూన్‌ మొదటి వారంలో నైరుతి వస్తుందని అంచనా 

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి ఎలా ఉంటాయన్న దానిపై మొదటి ముందస్తు అంచనాలను వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి సోమవారం వెల్లడించారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నైరుతి రుతుపవనాల కాలం ఉంటుందని, 50 ఏళ్ల సరాసరి అంచనాల ప్రకారం ఈసారి 96 శాతం వర్షపాతం రాష్ట్రంలో నమోదవుతుందని తెలిపారు. 96 శాతానికి అటుఇటుగా ఐదు శాతం తేడా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికంగా చూస్తే సాధారణానికి కాస్తంత తక్కువగానే నమోదవుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే జూన్‌ మొదటి వారంలో విడుదల చేయబోయే రెండో అంచనా నివేదిక ఇంకా స్పష్టంగా, ప్రాంతాల వారీగా ఉంటుందని, అప్పుడు కచ్చితమైన సమాచారం వస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈసారి నైరుతి రుతుపవనాల ద్వారా పడే వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇలాగే ఉంటుందన్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. 

నైరుతిలో 717 మి.మీ.వర్షం.. 
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ద్వారా సాధారణంగా 755 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదుకావాల్సి ఉందని, అయితే వచ్చే నైరుతి సీజన్‌లో 717 మి.మీ. వర్షం కురుస్తుందని వై.కె.రెడ్డి తెలిపారు. గతేడాది 97 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, 91 శాతానికే పరిమితమైందని చెప్పారు. రాయలసీమలో ఏకంగా 37 శాతం లోటు కనిపించిందన్నారు. ఈ విషయంలో వాతావరణశాఖ సరిగా అంచనా వేయలేకపోయిందని అంగీకరించారు. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్‌ 5–7 తేదీల మధ్య ప్రవేశిస్తాయని చెప్పారు. రాయలసీమలో 3–4 తేదీల మధ్య ప్రవేశించే అవకాశముందన్నారు. తమ వాతావరణ కేంద్రానికి చెందిన సబ్‌ డివిజన్లలో 60 శాతం చోట్ల వర్షాలు కురిస్తే రుతుపవనాలు వచ్చినట్లుగా ప్రకటిస్తామన్నారు. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తే కూడా రుతుపవనాలుగా గుర్తిస్తామన్నారు. నైరుతి రుతుపవనాల కాలంలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 999 ఎంఎంలు వర్షపాతం నమోదవుతుందన్నారు. అత్యంత తక్కువగా మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో నమోదవుతుందని అన్నారు.  

ఎల్‌నినో బలహీనం.. 
ఎలినినో, లానినోలపైనా వర్షాలు ఆధారపడి ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. అయితే ఒక్కోసారి వాటితో సంబంధం లేకుండా కూడా వర్షాలు వస్తాయని చెప్పారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఎల్‌నినో మరింత బలహీనంగా ఉంటుందన్నారు. పసిఫిక్‌ మహా సముద్రంలో భూమధ్య రేఖ దగ్గర సముద్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని లానినో అంటారు. ఎల్‌నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లానినో వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు. 

వచ్చే వారం నుంచి ఎక్కువ ఎండలు.. 
రాష్ట్రంలో వచ్చే వారం నుంచి ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. వారం తర్వాత ఉత్తర, తూర్పు తెలంగాణల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఉంటుందన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top