4 రోజుల్లో 95 టీఎంసీలు! | 95 tmc's in 4 days | Sakshi
Sakshi News home page

4 రోజుల్లో 95 టీఎంసీలు!

Published Wed, Jul 11 2018 2:20 AM | Last Updated on Wed, Jul 11 2018 2:20 AM

95 tmc's in 4 days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు స్థానికంగా కురుస్తున్న వర్షాలు తోడవడంతో గోదావరి ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండగా, ప్రాణహిత నదిలో వరద అంతకంతకీ పెరుగుతోంది. గోదావరి, ప్రాణహిత కలిసిన అనంతరం దిగువన మేడిగడ్డ వద్ద మంగళవారం 3.55 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. రెండ్రోజుల కిందట వరకు అక్కడ 2.40 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగినా, అది ఒక్కసారిగా లక్ష క్యూసెక్కులకు పెరిగింది.

నాలుగు రోజుల వ్యవధిలోనే మేడిగడ్డ బ్యారేజీని దాటుతూ 95 టీఎంసీల గోదావరి నీరు దిగువకు వెళ్లింది. సోమవారం ఒక్క రోజే 20 టీఎంసీలు దిగువకు వెళ్లగా, మంగళవారం మరో 30 టీఎంసీలు మేడిగడ్డ బ్యారేజీని దాటి వెళ్లిపోయింది. భారీ వరద నేపథ్యంలో బ్యారేజీలో 85 గేట్లలో 44 గేట్ల (నాలుగు బ్లాక్‌లు) నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేశారు. కాంక్రీట్‌ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. బేసిన్‌లోని ఎల్లంపల్లికి వరద ఉధృతి పెరుగుతోంది.

ప్రస్తుతం ప్రాజెక్టులోకి 13,111 క్యూసెక్కుల నీరు వస్తుం డటంతో అక్కడ నిల్వలు 20 టీఎంసీలకుగాను 7.89 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ సీజన్‌లో ఎల్లంపల్లిలోకి 4.13 టీఎంసీల కొత్తనీరు రాగా, మరో 12.29 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండనుంది. ఇక ఎస్సారెస్పీలోకి ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. రెండ్రోజుల కిందటి వరకు 10వేల క్యూసెక్కులకు పైగా వరద రాగా ప్రస్తుతం అది 2,401 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 12.12 టీఎంసీలకు చేరింది.

కడెంలోకి 5,730 క్యూసెక్కులు వస్తుండగా, నిల్వ 7.60 టీఎంసీలకు 6.92 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండటంతో 6,085 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరులోకి 461 క్యూసెక్కులు వస్తుండగా, నిజాంసాగర్‌లోకి చుక్క నీరు రావడం లేదు.

ఆల్మట్టికి పది రోజుల్లో 30 టీఎంసీలు..
కర్ణాటకలో ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తోంది. గడిచిన పది రోజులుగా ప్రాజెక్టులోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఏకంగా 30 టీఎంసీలకుపైగా కొత్త నీరు వచ్చి చేరింది. మంగళవారం సైతం ప్రాజెక్టులోకి ఏకంగా 52,897 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు నీటి మట్టం 57.73 టీఎంసీలకు చేరింది. 71.99 టీఎంసీల మేర నీటిలోటు కనబడుతోంది.తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి.

38,052 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 46.16 టీఎంసీలకు చేరింది. ఇక నారాయణపూర్‌కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ 37 టీఎంసీలకు ప్రస్తు తం 23.81 టీఎంసీల మేర నిల్వలతో ఆశాజనకంగా ఉన్నాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.73, నాగార్జునసాగర్‌ లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎం సీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29.06 టీఎంసీల నిల్వలున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement