నగరంలో స్కైవేలు

8 Skyways And 52 Foot Over Bridges In Hyderabad - Sakshi

పాదచారులకు ప్రత్యేకం

54 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు    

సాక్షి, హైదరాబాద్‌ : ఇప్పటి వరకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఫ్లై ఓవర్లు, స్టీల్‌ బ్రిడ్జిలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ త్వరలో కేవలం పాదచారుల కోసం ప్రత్యేకంగా ఎనిమిది ప్రాంతాల్లో స్టీల్‌ స్కైవేలను అందుబాటులోకి తేనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లను దాటలేక పాదచారులు పడుతున్న వేదనలు వర్ణనాతీతం. ఇప్పటికే పాదచారులకు ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ మరోవైపు జంక్షన్లు.. తీవ్ర రద్దీ ప్రాంతాల్లో పాదచారులు రోడ్డుకు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు స్కైవాక్‌లను నిర్మిచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలిదశలో ఎనిమిది ప్రాంతాల్లో ఈ స్కైవాక్‌లను నిర్మించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్గాలను బట్టి అందుకనుగుణంగా వర్తులాకారంలో, త్రిభుజారకారంలో, చతురస్రాకారంలో ఈ స్కైవేలు ఏర్పాటు చేస్తారు. ఇలా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాలుగు వైపులకు వెళ్లేలా, మెహదీపట్నంలో మూడు వైపులకు వెళ్లేలా స్కైవేలు నిర్మించనున్నారు. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 52 ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు(ఎఫ్‌ఓబీలు) నిర్మించనున్నారు. ఇవి రోడ్డుకు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు ఉపకరిస్తాయి. వీటిల్లో ఎలివేటర్లు ఉండేవి కూడా ఉన్నాయి.

ఎనిమిది స్కైవేలు, 52 ఎఫ్‌ఓబీల ఏర్పాటుకు అవసరమైన రూ. 207 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనపర అనుమతులిస్తూ మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వు జారీ చేశారు. వీటిల్లో 39 ఎఫ్‌ఓబీలకు అవసరమైన రూ.75 కోట్లు హెచ్‌ఎండీఏ భరిస్తుంది. మిగతావి జీహెచ్‌ఎంసీ నుంచి ఖర్చు చేస్తారు. నగరంలో ఎఫ్‌ఓబీల ఏర్పాటుకు ఏళ్ల తరబడి జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. ఇటీవల 44 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు ఏర్పాటును ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ నుంచి హెచ్‌ఎండీఏకు బదిలీ చేసింది. వాటిల్లో ఐదు ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటుకు సిద్ధమైన హెచ్‌ఎండీయే మిగతావి తమవల్ల కాదంటూ చేతులెత్తేసింది. మిగతా 39 ఎఫ్‌ఓబీలను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసింది. వాటికయ్యే వ్యయాన్ని మాత్రం హెచ్‌ఎండీనే భరించాల్సి ఉంది. స్కైవేలను పాదచారులకు ఉపకరించేలా ఉండటంతో పాటు ఆకర్షణీయంగా, ప్రత్యేక డిజైన్లతో ఏర్పాటు చేయనున్నారు. పాదచారుల భద్రత కోసం ఎఫ్‌ఓబీలు అవసరమని ట్రాఫిక్‌ పోలీసులు సూచించడంతో సిద్ధమవుతున్నారు.

స్కైవేలిక్కడ.. 
1. ఉప్పల్‌రింగ్‌రోడ్డు 
2. ఆరాంఘర్‌ చౌరస్తా 
3. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ 
4.లక్డికాపూల్‌ 
5. రోడ్‌ నెంబర్‌ 1, 12 జంక్షన్, బంజారాహిల్స్‌ 
6. మెహిదీపట్నం 7.సుచిత్రా జంక్షన్‌ 
8. బోయిన్‌పల్లి క్రాస్‌రోడ్‌ 

ఎఫ్‌ఓబీలు..  
రామకృష్ణమఠం(ఇందిరాపార్కు ఎదుట), చిలకలగూడ రింగ్‌రోడ్,  మహవీర్‌ హాస్పిటల్, చెన్నయ్‌ షాపింగ్‌మాల్‌(మదీనగూడ), హైదరాబాద్‌ సెంట్రల్‌మాల్, ఆల్విన్‌క్రాస్‌రోడ్స్‌(మియాపూర్‌), ఉప్పల్‌ రింగ్‌రోడ్, హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌(రామంతాపూర్‌), ఇందిరానగర్‌ జంక్షన్‌(గచ్చిబౌలి), నేరెడ్‌మెట్‌ బస్టాప్, గాంధీ హాస్పిటల్, కేవీఆర్‌ కాలేజ్‌(సంతోష్‌నగర్‌), గెలాక్సీ(టోలిచౌకి), ఆరెమైసమ్మ టెంపుల్‌(లంగర్‌హౌస్‌), సాయిసుధీర్‌కాలేజ్‌(ఏఎస్‌రావునగర్‌), రాయదుర్గం జంక్షన్, ఒయాసిస్‌ స్కూల్‌(షేక్‌పేట), ఈఎస్‌ఐ హాస్పిటల్‌(ఎర్రగడ్డ),  విజేత సూపర్‌ మార్కెట్‌(చందానగర్‌), వర్డ్‌ అండ్‌ డీడ్‌ స్కూల్‌ (హయత్‌నగర్‌), హెచ్‌ఎండీఏ(మైత్రివనం), జీడిమెట్ల బస్టాప్, నోమ ఫంక్షన్‌ హాల్‌(మల్లాపూర్‌), రంగభుజంగ థియేటర్‌(షాపూర్‌నగర్‌), స్వప్న థియేటర్‌(రాజేంద్రనగర్‌), సన్‌సిటీ(బండ్లగూడ), సుచిత్ర సర్కిల్, ఐడీఏ ఉప్పల్, విశాల్‌మార్ట్‌(అంబర్‌పేట), బిగ్‌బజార్‌(ఐఎస్‌ సదన్‌), దుర్గానగర్‌ టి జంక్షన్, సుష్మ థియేటర్‌ (వనస్థలిపురం), నెహ్రుజూలాజికల్‌పార్క్, ఓల్డ్‌కర్నూల్‌రోడ్‌ టి జంక్షన్‌(ఉందానగర్‌ దగ్గర),  అపోలో హాస్పిటల్‌(సంతోష్‌నగర్‌), ఒమర్‌ హోటల్, సైబర్‌గేట్‌వే(హెటెక్‌సిటీ) తదితర ప్రాంతాలున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top