
చేర్యాల(సిద్దిపేట) : ఆరున్నరేళ్ల వయసులోనే వంద పద్యాలను చూడకుండా పాడిన బాల కవయిత్రి శ్రేష్ట ప్రవస్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా, చేర్యాలలోని గాయత్రి హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రేష్ట ఈ ఘనత సాధించింది. చేర్యాలకు చెందిన శివగారి కిరణ్, రజని దంపతుల కుమార్తె శ్రేష్ట ప్రవస్థి 18 నిమిషాల్లో వేమన శతకంలోని 100 పద్యాలను చూడకుండా పాడి రికార్డు సాధించింది. కాగా, శ్రేష్ట ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో నిర్వహించిన బాలకవి సమ్మేళనంలో పాల్గొని 52 పద్యాలు పాడి అందరి మన్ననలు పొందింది. త్వరలోనే వంద పద్యాలు పాడి రికార్డు సాధిస్తానని చెప్పింది. అన్నట్టుగానే వేమన శతకాన్ని 18 నిమిషాల్లో చూడకుండా చదివి వినిపించి రికార్డు సృష్టించింది.