కరోనా: తెలంగాణలో మళ్లీ పెరిగాయ్‌!

50 New Corona Positive Cases Recorded In Telangana - Sakshi

గురువారం ఒక్కరోజే నమోదైనపాజిటివ్‌ కేసులు 50 

 700కి చేరిన కేసులు గురువారం 68 మంది డిశ్చార్జి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుం దనే అంచనాలు 24 గంటలు కూడా గడవకముందే తలకిందులయ్యాయి. గురువారం ఏకంగా 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 700కి చేరుకుంది. గురువారం మొత్తం 800 మంది నమూనాలను పరీక్షించగా, 50 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. నమోదైన కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 మంది మరణించారు. ఇక గురువారం 68 మంది డిశ్చార్జి కావడంతో, కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 186కి చేరింది. 

13 జిల్లాల్లో 159 కంటైన్మెంట్‌ ప్రాంతాలు
వైరస్‌ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా, గురువారం నాటికి 13 జిల్లాల్లో 159 కంటైన్మెంట్‌ ప్రాంతాలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో తాజాగా 99,257 ఇళ్లకు వెళ్లి, 3,97,028 మందిని వైద్య బృందాలు కలిసి వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి
విషమంగా లేదని, ముగ్గురు వెంటిలేటర్‌పై ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు.. వారితో కాంటాక్ట్‌ అయినవారు పరీక్షలకు ముందుకు రావాలని కోరారు.

గాంధీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి పాజిటివ్‌
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి(35)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయినట్టు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాతబస్తీలోని యాకుత్‌పురాకు చెందిన వ్యక్తి గాంధీ మెడికల్‌ కాలేజీలోని ఎలక్ట్రానిక్‌ లైబ్రరీలో రెగ్యులర్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో రెండు రోజుల క్రితం అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. గురువారం రాత్రి అందిన నివేదికలో అతడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. వెంటనే సదరు బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నమూనాలు ఇచ్చిన తర్వాత రెండు రోజులు అతడు విధులకు హాజరు కావడంతో గాంధీ ఆస్పత్రిలోని వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర సిబ్బంది భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. అందరితోనూ అతడు కలివిడిగా ఉంటాడని తెలిసింది. బుధవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ పేషీల వద్ద అతడు తిరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా పేషీలలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కాగా, గాంధీ మెడికల్‌ కాలేజీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ధ్రువీకరించడానికి సంబంధిత అధికారులు అందుబాటులో లేరు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top