గ్రేటర్‌లో కరోనా టెర్రర్‌

42 Corona Cases File Friday in Hyderabad - Sakshi

నగరంలో తగ్గని కరోనా వైరస్‌ ఉధృతి

తాజాగా మరో ముగ్గురి మృతి

శుక్రవారం మరో 42 కేసులు నమోదు  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 48మంది మృతి చెందగా, వీరిలో 42మంది గ్రేటర్‌ వాసులే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం మరో ముగ్గురు మృతి చెందారు.  లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కేసుల సంఖ్య తగ్గక పోగా..మరింత పెరుగుతుండటం గ్రేటర్‌వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మరణాల  సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1699 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గ్రేటర్‌లోనే 1146 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో కొత్తగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న 9 మంది అడ్మిట్‌ అయ్యారు. నెగిటివ్‌ వచ్చిన ఐదుగురిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 11 మంది అనుమానితులు ఉన్నారు. వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఫీవర్‌ ఆస్పత్రిలో 12 మందిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసుకున్నారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. 

బీఎన్‌రెడ్డి నగర్‌లో వృద్ధురాలికి పాజిటివ్‌
ఎల్‌బీనగర్‌: బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని ఈ– సేవా సమీపంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలికి (71) కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమెకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆమెను  గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఏడుగురిని పరీక్షల నిమిత్తం కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇంటి పరిసరాల్లో  శానిటైజేషన్‌ చేశారు.

భోలక్‌పూర్‌లో వృద్ధుడికి..
కవాడిగూడ: భోలక్‌పూర్‌ డివిజన్‌ బంగ్లాదేశ్‌ మార్కెట్‌లో ఓ వృద్ధుడి(65)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.  కిడ్నీ  వ్యాధితో బాధపడుతున్న అతను గురువారం అపోలో ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో శుక్రవారం అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన బైబిల్‌హౌస్‌ యుపీహెచ్‌ వైద్యాధికారి డాక్టర్‌ ఫర్హీన్, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–15 డీఎంసీ సి. ఉమాప్రకాష్, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ హేమలత సదరు వృద్ధుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో  సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.  

రామంతాపూర్‌ గణేష్‌నగర్‌లో వ్యాపారికి..
ఉప్పల్‌: ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో శుక్రవారం ఓ పాజిటివ్‌ కేసు వెలుగులోకి వచ్చింది. రామంతాపూర్‌ గణేష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఫ్లై ఉడ్‌ వ్యాపారి(43)కి కోవిడ్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. అతడి ఇంటి పరిసరాల్లో హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

జియాగూడలో మరో ఐదుగురికి..
జియాగూడ: జియాగూడ డివిజన్‌ పరిధిలోని రెండు బస్తీల్లో మరో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌  నిర్ధారణ అయ్యింది. శుక్రవారం జీహెచ్‌ఎంసీ అధికారులు వివరాలు వెల్లడించారు. స్థానిక లక్ష్మీనరసింహనగర్‌కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కరోనాతో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందిన ఇందిరానగర్‌కు చెందిన వృద్ధుడి(68) కుటుంబసభ్యులను 8 మందిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐదుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుమ్మరివాడికి చెందిన ఓ వృద్ధురాలు(70) కూడా కరోనా బారిన పడినట్లు వారు పేర్కొన్నారు.

బోయిన్‌పల్లి ఠాణాలో కరోనా కలకలం
కంటోన్మెంట్‌: నార్త్‌జోన్‌ పరిధిలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి కలకలం నెలకొంది. గతంలో గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన ముగ్గురిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. గాంధీ ఆసుపత్రి వద్ద కొన్ని రోజుల పాటు  ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఎస్సై విధులు నిర్వర్తించారు. గత వారం రోజులుగా వారు పీస్‌కు వస్తున్నారు. అయితే వారిలో ఓ కానిస్టేబుల్‌కు శుక్రవారం జ్వరం రావడంతో అధికారులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరినీ హోం క్వారంటైన్‌ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌ను శానిటైజ్‌ చేయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top