సర్కారు ఆస్పత్రులకు గుర్తింపు

35 PHCs In Telangana Receive Quality Certificate From Central Govt - Sakshi

35 పీహెచ్‌సీల్లో నాణ్యత ప్రమాణాలు భేష్‌: కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించిన పలు సర్కారు ఆసుపత్రులకు కేంద్రం గుర్తింపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలో 35 ప్రభుత్వ ఆసుపత్రులు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్వాష్‌) ధ్రువీకరణ పత్రాలు పొందాయి. నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు ఇస్తున్న తరహాలోనే ప్రభుత్వ ఆసుపత్రులకూ ఎన్‌క్వాష్‌ను కేంద్రం ప్రారంభించింది. నాణ్యత ధ్రువీకరణ పత్రాలు పొందిన ఆసుపత్రుల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంది. వాటిల్లో పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తుంది. గతంలో మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఆసుపత్రి, భద్రాచలం, బాన్సువాడ ఏరియా ఆసుపత్రులు సహా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్వాష్‌ సర్టిఫికెట్లు పొందాయి.

కొత్తగా ఎన్‌క్వాష్‌ సర్టిఫికెట్లు పొందిన ఆసుపత్రులు అనేకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే ఉండటం గమనార్హం. బిక్నూరు, దేవరకొండ, హన్‌వాడ, బొమ్మలరామారం, కొండమడుగు, ధర్మాసాగర్, గోపాల్‌పూర్, థరూర్, మనూపాడు, ఎర్రగుంట, గండంపల్లి, కంభాలపల్లి, కంగ్టి, రఘునాధపల్లి, ఘన్‌పూర్, తాండూరు, కత్లాపూర్, మేడిపల్లి, గారెపల్లి, జైపూర్, శంకరంపట్నం, లీజా, గట్టు, ఆత్మకూర్, సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్‌క్వాష్‌ సర్టిఫికేట్లు అందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి కూడా సర్టిఫికేట్‌ వచ్చింది. గతంలో 39 దవాఖానాలకు ఈ ఎన్‌క్వాష్‌ సర్టిఫికెట్లు ఉండగా, ప్రస్తుత సర్టిఫికెట్లతో ఆస్పత్రుల సంఖ్య 74కు చేరింది. దీంతో ఈ సర్టిఫికెట్లు పొందడంలో దేశంలోనే తెలంగాణ టాప్‌ గా నిలిచింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top