పల్లెల్లో ఈతవనాలకు పెద్దపీట

ప్రతి గ్రామంలో 3 వేల నుంచి 6 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
వేగవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎక్సైజ్ కమిషనర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈత వనాల పెంపకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా ప్రతి గ్రామంలో ఈత వనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక నర్సరీ లను ఏర్పాటు చేసి ఈత మొక్కలు పెంచాలని, రానున్న వర్షాకాలంలో హరితహారంలో భాగంగా వీటిని పెంచేందుకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఇటీవల లేఖ రాశారు. వీలున్నంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ లేఖలో ఆయన ఆదేశించారు.
వనాల పెంపకం... వారి సంక్షేమం కోసమే..
గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ఈత వనాల పెంపకాన్ని ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే ఎక్సైజ్ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా 3 వేల నుంచి 6 వేల ఈత మొక్క లు నాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆ గ్రామంలో గీతకార్మికులున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా చెట్లు పెంచాలని, గీత కార్మికులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో వారి అవసరాలకు అనుగుణంగా ఈ సంఖ్యను పెంచాలని తెలిపారు. ఈత వనాల పెంపకానికి గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్ శాఖ, ఉద్యాన, రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి