మహిళా రైతులకు 30 శాతం నిధులు! | 30 percent funds for women farmers | Sakshi
Sakshi News home page

మహిళా రైతులకు 30 శాతం నిధులు!

Sep 3 2017 1:45 AM | Updated on Sep 17 2017 6:18 PM

మహిళా రైతులకు 30 శాతం నిధులు!

మహిళా రైతులకు 30 శాతం నిధులు!

వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వ్యవసాయ పథకాల్లో కేటాయించాలని కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే మహిళా రైతుల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మహిళా స్వయం సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాల ని భావిస్తోంది. గతేడాది నిర్ణయించిన విధంగా ఏటా అక్టోబర్‌ 15వ తేదీని మహిళా రైతు దినోత్సవంగా పాటించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది. మహిళా రైతే కేంద్ర బిందువుగా వ్యవసాయ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ను అమలు చేయాలని స్పష్టంచేసింది. అప్పుడే వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకతలు పెరిగి ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు చేయవచ్చని పేర్కొంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని వ్యవసాయ ఉన్నతాధికారులను కోరింది. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

వ్యవసాయ రంగంలో తగ్గుదల
దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారేనని జాతీయ నమూనా సర్వే తేల్చినట్లు కేంద్రం తెలిపింది. ఆ 80 శాతం మందిలో 33 శాతం మహిళలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. 48 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి కలిగిన మహిళా రైతులున్నారు. భారతదేశం సహా పలు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ మహిళ భాగస్వా మ్యం ఎక్కువగా ఉంది. మరోవైపు దేశంలో గత మూడు దశాబ్దాల్లో వ్యవసాయ రంగంలో పని చేస్తున్న పురుషులు, మహిళల సంఖ్య తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో పని చేసే పురుషుల సంఖ్య 81 శాతం నుంచి 63 శాతానికి తగ్గగా, మహిళల సంఖ్య 88 శాతం నుంచి 79 శాతానికి తగ్గిందని జాతీయ సర్వేలో వెల్లడైనట్లు కేంద్రం వివరించింది. సాపేక్షికంగా ఇప్పటికీ వ్యవసాయంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉందని తెలిపింది. అందువల్ల వ్యవసాయ పథకాల బడ్జెట్లలో 30 శాతం మహిళా రైతులకు కేటాయించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని స్పష్టంచేసింది.

మహిళా రైతులదే కీలక పాత్ర
వ్యవసాయ రంగంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగు మొదలు కోత వరకు పంటలకు అవస రమైన అన్ని పనుల్లో ఉంటున్నారు.  పశువులు కాయడం, గడ్డి సేకరించడం, కోళ్ల పెంపకం, డెయిరీ నిర్వహణ ఇలా బహుళ రకాల వ్యవసాయ అనుబంధ పనుల్లోనూ కీలకంగా మారారు. కాని వ్యవసాయ కూలీలుగా వెళ్తున్న మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. పురుషుల కంటే వారితో ఎక్కువ పని చేయించి తక్కువ కూలీ ఇవ్వడం సర్వ సాధారణమైంది. ఈ పరిస్థితి మారాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రాల్లో మహిళా రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement