ఒక్క రోజులో 26,488 కేసులు | 26 488 Case Solved Within One Day In Telangana | Sakshi
Sakshi News home page

ఒక్క రోజులో 26,488 కేసులు

Dec 15 2019 1:26 AM | Updated on Dec 15 2019 9:12 AM

26 488 Case Solved Within One Day In Telangana - Sakshi

కేసులను పరిష్కరిస్తున్న న్యాయమూర్తులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని కోర్టుల్లో లోక్‌ అదాలత్‌లను నిర్వహించారు. మొత్తంగా ఈ రోజు 26,488 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో హైకోర్టులో 503 కేసులు, కింది స్థాయి కోర్టుల్లో 25,985 కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ జాబితాలో వివాద ప్రారంభ దశలో ఉన్న 14,462 కేసులు, విచారణలో ఉన్న 11,523 కేసులున్నాయి. హైకోర్టు కేసులు రాజీ కావడం ద్వారా కక్షిదారులకు రూ. 4.71 కోట్లు అందనుంది. కింది స్థాయి కోర్టుల్లో కేసుల రాజీతో రూ. 54.60 కోట్ల మేరకు వాద, ప్రతివాదులకు చెల్లించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.

హైకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్, రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ జీవీ సీతాపతిలు పలు కేసుల్ని రాజీ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఆదేశాలతో రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావులు అన్ని జిల్లాల్లో లోక్‌ అదాలత్‌లను పర్యవేక్షించారు. ముగ్గురు న్యాయమూర్తులు హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల్లో కేసులను వాద, ప్రతివాదుల అంగీకారంతో రాజీ అయ్యేలా చేశారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా పెద్ద సంఖ్యలో కేసుల్ని ఇరుపక్షాల అంగీకారంతో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement