వరంగల్ నగర శివారులోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న భవనం బుధవారం రాత్రి కూలింది.
స్లాబ్ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం
Dec 10 2015 8:54 AM | Updated on Sep 3 2017 1:44 PM
హసన్‌పర్తి : వరంగల్ నగర శివారులోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న భవనం బుధవారం రాత్రి కూలింది. అన్నాసాగరంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అదే ఆవరణలో మరో భవన నిర్మాణ పనులను ఏడాది క్రితం ప్రారంభించారు. నిర్మాణంలో నెల్లూరు, వరంగల్ జిల్లాలకు చెందిన కూలీలు పని చేస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు మొత్తం 18 మంది కూలీలు అక్కడ ఉన్నారు. 12 మంది పైన పని చేస్తుండగా.. ఆరుగురు కింద ఉన్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు భవనం రెండో అంతస్తు స్లాబ్ పూర్తయ్యే క్రమంలో ప్రమాదవశాత్తు స్లాబ్ కుప్పకూలింది.
వెడ్ మిక్సింగ్ మిషిన్ పైప్ వైబ్రేషన్‌కు పైఅంతస్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ప్రసాద్(35), హసన్‌పర్తి మండలంలోని అన్నాసాగర్‌కు చెందిన లక్కి రాజేష్(35)కు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజేష్ మృతి చెందాడు. ప్రసాద్ వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్లాబ్ కుప్పకూలుతోందని గ్రహించిన ప్రసాద్, రాజేష్‌లు పైనుంచి కిందికి దూకారు. అయితే వారు దూకుతున్న క్రమంలో వారిపై నిర్మాణానికి వినియోగించిన సామగ్రి పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మిగతా పదిమంది సామగ్రి మధ్యలో పడటంతో గాయాలయ్యాయి. కింద పనిచేస్తున్న కూలీలు.. స్లాబ్ కూలు తుండడం గమనించి పరుగులు తీశారు. సమాచారం తెలిసిన వెంటనే వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Advertisement
Advertisement