అభివృద్ధి బాట | The 161th National Highway Expansion in four lines | Sakshi
Sakshi News home page

నాలుగు వరుసలుగా 161వ జాతీయ రహదారి విస్తరణ

Mar 14 2018 11:45 AM | Updated on Mar 14 2018 11:45 AM

The 161th National Highway Expansion in four lines - Sakshi

సంగారెడ్డి- నాందేడ్‌ రహదారి

పెద్దశంకరంపేట(మెదక్‌): ఉమ్మడి జిల్లాలైన సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల మీదుగా వెళ్తున్న 161వ జాతీయ రహదారి (సంగారెడ్డి–నాందేడ్‌– అకోలా)ని నాలుగు వరుసలుగా చేపట్టేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా భూ సేకరణ పనులను అధికారులు ముమ్మురం చేశారు. రూ.2500 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతూ 140 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారిని విస్తరించనున్నారు.

మెదక్‌ జిల్లాలో టేక్మాల్‌ , అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా భారత్‌మాలలో భాగంగా 2018–19 సంవత్సరంలో 4,500 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 367 కిలోమీటర్ల మేరకు 5 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను పిలిచింది. మిగతా 529 కిలోమీటర్ల జాతీయ రహదారిని భారత్‌మాల ఫేజ్‌–1 ప్రాజెక్టు కింద చేపట్టేందుకు నిర్ణయించింది. వీటిని 2021–22 కల్లా పూర్తిచేయాలని సంకల్పించింది.

పూర్తయిన విస్తరణ సర్వే
పెద్దశంకరంపేట మండలం మీదుగా వెళ్తున్న రహదారిలో భాగంగా జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్‌ నుంచి టేక్మాల్‌ మండలం బొడ్మట్‌పల్లి, పేట మండలంలోని జంబికుం వరకు 27 కిలోమీటర్ల వరకు విస్తరణలో రైతులు, ఇతర వాణిజ్య, వ్యాపారస్థులు నష్టపోనున్నారు. ఈ మండలాల పరిధిలో 266 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అల్లాదుర్గంలో 144.08 ఎకరాలు, టేక్మాల్‌ మండలంలో 21.9 ఎకరాలు, పేట మండలంలో 100.17 ఎకరాలను సేకరిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల 100 ఫీట్ల రహదారిని విస్తరించనున్నారు. 

మార్కెట్‌ ధరకు అనుగుణంగా..
ఈ జాతీయ రహదారిపై ఎనిమిది చోట్ల బైపాస్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సంగారెడ్డి, అందోల్‌–జోగిపేట, పెద్దశంకరంపేట, నిజాంపేట, పిట్లం, పెద్దకొడుపుగల్, మేనూరు, మద్నూర్‌ గ్రామాల పరిధిలో బైపాస్‌లను నిర్మించనున్నారు. జిల్లాలో కేవలం పేట మండలంలోనే బైపాస్‌ ఏర్పాటు కానుంది. అల్లాదుర్గం, టేక్మాల్‌ పరిధిలో బైపాస్‌లు లేవు. పేటలో కట్టెల వెంకటాపూర్‌ శివారులోని రాఘవానితాండా నుంచి కమలాపూర్‌ వరకు 2.5 కిలోమీటర్ల దూరం బైపాస్‌ను ఏర్పాటు చేయనున్నారు.

భూసేకరణలో భాగంగా భూములు నష్టపోతున్న వారు ప్రస్తుత మార్కెట్‌ ధరకు అనుగుణంగా ధరలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవలే అల్లాదుర్గం, టేక్మాల్, పేట మండలాలకు చెందిన భూ నిర్వాసితులతో ఆర్డీఓ నగేష్, అధికారులు సమావేశం నిర్వహించారు. మరో రెండు సార్లు సమావేశం కూడా నిర్వహించనున్నారు.


నష్టపరిహారం పెంచాలి
జాతీయరహదారి విస్తరణలో భూములు కొల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్‌ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంలో ప్రభ్తుత్వం చర్యలు చేపట్టాలి. మాకు ముందుగానే నష్టపరిహారం చెల్లించాలి. నష్టపోతున్న వారికి ఉపాధి సైతం చూపించాలి.
    –యాదగిరి, కమలాపూర్, పెద్దశంకరంపేట
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement