సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో మద్యం ప్రియులకు ఊహించని షాక్ తగలనుంది. ముఖ్యంగా వేసవిలో చల్లటి బీరు తాగి రిలాక్స్ అవుదామనే వారికి మాత్రం ఇది చేదు వార్తే. ఎందుకంటే.. వచ్చే వేసవి నాటికి రాష్ట్రంలో బీర్ల సరఫరా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయడమే. ప్రాజెక్ట్‌కు, బీర్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. అయితే.. ఇది తెలుసుకోండి.
సింగూరు డ్యామ్ సెఫ్టీ రివ్యూ ప్యానెల్ సూచనలు మేరకు ఈ వేసవిలో ప్రాజెక్ట్‌లోని నీటిని ఖాళీ చేసి అధికారులు మరమ్మతులు చేయనున్నారు. దీంతో, సంగారెడ్డిలోని నాలుగు ప్రధాన బెవరేజెస్ కంపెనీలకు సింగూరు నుంచే వెళ్లే నీటి సరఫరా ఆగిపోతుంది. నీటి వనరులు లేని కారణంగా బీర్ల కంపెనీలలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సింగూరు జల మండలి నుంచి బీర్ల ఫ్యాక్టరీలకు రోజుకు 44 లక్ష లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటి సరఫరా లేకపోతే ఉత్పత్తి నిలిచిపోనుంది. అలాగే, సిటీలో మంచి నీటి సరఫరాకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలోని ఫ్యాక్టరీల నుంచి 11 రాష్ట్రాలకు బీర్ల సరఫరా జరుగుతోంది. నామమాత్రపు ధరకే బీర్ల ఫ్యాక్టరీలకు నీటి సరఫరా అందిస్తున్నారు. ఇప్పుడు అధిక ఛార్జీలు వసూలు చేసి నీటి సరఫరా చేస్తే బీర్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేస్తున్నా దృష్ట్యా ఫ్యాక్టరీలకు భారీ నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో, బీర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వేసవి దృష్ట్యా బీర్ల ఉత్పత్తి తగ్గరాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందు కోసం తగిన ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.



