స్టేట్‌హోం నుంచి 11మంది యువతుల పరారీ

స్టేట్‌హోం నుంచి 11మంది యువతుల  పరారీ


సికింద్రాబాద్‌లో పట్టుబడిన బాలిక

హైదరాబాద్ : నగరంలోని యూసుఫ్‌గూడ స్టేట్‌హోం నుంచి 11మంది యువతులు అధికారుల కళ్లుగప్పి బుధవారం ఉదయం పరారయ్యారు. వీరిలో ఇటీవలే ప్రసవించిన ఒకామె తన ఆరునెలల బాలుడ్ని కూడా తీసుకొని వెళ్లిందని అధికారులు గుర్తించారు. వెళ్లిపోయిన వారిలో కొందరు బాలికలు కూడా ఉన్నారు. వీరిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ బాలిక (15) సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.



యువతులు హాస్టల్‌కున్న ఓ కిటికీ గుండా వెళ్లి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న  రెస్క్యూహోం సూపరింటెండెంట్ నిర్మల ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్టేట్ హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే యువతులు పారిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారైన వారిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు  చెందిన వారితో పాటు, నల్గొండ, మెదక్,కరీంనగర్, జిల్లాలకు చెందినవారున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు,పోలీసులు హోం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మిగతా వారిని పట్టుకునేం దుకు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.

 

కోర్టు కేసులకు పంపనందునే..

మంగళవారం రాత్రి అధికారుల తనఖీలో హోంలో ఉన్న పలువురి వద్దనుంచి సెల్‌ఫోన్లను తీసుకోవడం వల్లనే వీరంతా పథకం ప్రకారం వెళ్లిపోయినట్లు తొలుత అధికారులు భావించారు. అయితే పట్టుబడిన బాలిక సమాచారం ప్రకారం వీరిలో అధికులు వివిధ ప్రాంతాల్లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. వాటికి వారిని హాజరు పరిచే విషయంలో హోం నిర్వాహకులు శ్రద్ధచూపక పోవడంతో వారంతా కూడబలుక్కొని పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం కోర్టుకు హాజరయ్యేందుకు అంతా పరారైనట్లు బాలిక కథనం. ఈ మేరకు తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారంతా అమీర్ పేటకు వచ్చారని వారితో కలిసే వెళ్లిపోయామని వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top