గంపెడాశలతో.. | 10th PRC to be given for Telangana Employees, says KCR | Sakshi
Sakshi News home page

గంపెడాశలతో..

Jan 7 2015 1:20 AM | Updated on Sep 6 2018 3:01 PM

గంపెడాశలతో.. - Sakshi

గంపెడాశలతో..

పదో వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసుల అమలుపై తెలంగాణలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు.

* వేతన సవరణపై తెలంగాణ ఉద్యోగుల్లో ఉత్కంఠ
* పదో పీఆర్‌సీ నివేదికలోని అంశాలపై తీవ్ర చర్చ
* ఫిట్‌మెంట్, అమలు తేదీపైనే ప్రధాన దృష్టి
* కడుపునిండా పీఆర్‌సీ ఇస్తామన్న సీఎం హామీతో భారీ అంచనాలు
* ఈ నెల మూడో వారంలో ప్రకటిస్తామని చెప్పిన కేసీఆర్
* అమలైతే రెట్టింపునకు పైగా వేతనాలు పెరిగే అవకాశం
* లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు
* కేడర్లవారీగా వేతనాలను క్రోడీకరించిన ‘సాక్షి’

 
 సాక్షి, హైదరాబాద్: పదో వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసుల అమలుపై తెలంగాణలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. కడుపునిండా పీఆర్‌సీ ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో అంచనాలు ఎక్కువయ్యాయి. పూర్తి స్థాయి నివేదిక బయటకు రావడంతో అందులో పేర్కొన్న పలు అంశాలపై ఉద్యోగ, పెన్షనర్లలో తీవ్ర చర్చ మొదలైంది. ఎవరికివారు తమ వేతనాలు ఎంత మేరకు పెరుగుతాయన్న లెక్కల్లో మునిగిపోయారు.
 
 వేతన పెంపుతో పాటు ఇతర ప్రయోజనాలపైనా కొంత స్పష్టత ఏర్పడినా ఫిట్‌మెంట్ ఎంతన్నదే ఇంకా తేలాల్సి ఉంది. అలాగే ఈ ఆర్థిక లబ్ధిని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారన్నది కూడా కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పీఆర్‌సీ నివేదిక బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలోని ఉద్యోగులకూ దాని ఆధారంగానే వేతన సవరణ జరగనుంది. ఈ నెల మూడో వారంలో పీఆర్‌సీ అమలును ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తాజా నివేదికను ఉద్యోగ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాష్ర్టంలోని దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది వర్తించనుంది.
 
 ‘ఫిట్‌మెంట్’ ఎంతిస్తారో..!
 రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్(మూల వేతనంలో పెంపు)ను పదో పీఆర్‌సీ కమిషనర్ అగర్వాల్ సిఫారసు చేశారు. అయితే పెరిగిన నిత్యావసరాల దృష్ట్యా 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంతోపాటు నగదు రూపంలో చెల్లింపు విషయంలో ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగసంఘాల మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంది.
 
 ఇప్పటికే రెండున్నర పీఆర్సీల కాలాన్ని ఉద్యోగులు కోల్పోయారని, ఇప్పుడు ఫిట్‌మెంట్ గరిష్టంగా ఉండకపోతే మరింతగా నష్టపోవాల్సి ఉంటుందని సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి. అలాగే పీఆర్‌సీ అమలు తేదీ కూడా మరో కీలకాంశం. 2013 జూలై నుంచే ఉద్యోగులకు ఆర్థిక లబ్ధిని వర్తింపజేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2013 ప్రథమార్ధం గణాంకాల ఆధారంగా కనీస వేతనాన్ని వేతన సవరణ సంఘం నిర్ణయించిందని, ఏడాదిన్నర తర్వాత దాన్ని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు నష్టం కలుగుతుందని వాదిస్తున్నారు.
 
 అలాగే అప్పటి నుంచి రాష్ర్టం ఏర్పాటైన 2014 జూన్ 2 వరకు దాదాపు 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఆ తర్వాతి కాలంలోనూ మరో ఐదారు వేల మంది రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో 2013 జూలై నుంచి పీఆర్‌సీని అమలు చేయకపోతే వారందరికీ అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. తొమ్మిదో పీఆర్సీ సమయంలో ఇదే సమస్య వచ్చినప్పుడు.. కొందరు ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈసారి అలాంటి సమస్య రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కడుపునిండా పీఆర్‌సీ ఇస్తామని సీఎం స్వయంగా చెప్పడంతో ఉద్యోగుల్లో ఉత్సుకత నెలకొంది. ఈ రెండు ప్రధానాంశాలు తేలితే మిగతా డిమాండ్లను సులువుగానే నెరవేర్చుకోవచ్చునని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.  
 
 20 కేటగిరీల్లో అత్యధిక పెంపు  
 పీఆర్‌సీ నివేదికలో పొందుపరచిన వేతనాల వివరాలను ‘సాక్షి’ క్రోడీకరించింది. 20 కేటగిరీల్లో ఉద్యోగులకు రెట్టింపునకు మించి వేతనాలను పదో పీఆర్‌సీ సిఫారసు చేసింది. గతంలో అన్యాయం జరిగిందంటూ వచ్చిన విజ్ఞప్తులు, ఆయా విభాగాల్లో వారు అందిస్తున్న సేవలు, ఒకే కేడర్ ఉద్యోగులైనా శాఖలను బట్టి వేతనాల్లో హెచ్చుతగ్గులు వంటి పలు అంశాలను పీఆర్‌సీ పరిగణనలోకి తీసుకుంది. దీన్ని బట్టి 20 కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు సాధారణ పెంపుతోపాటు అదనంగా ఇంక్రిమెంట్లను కలిపింది. వీరికి 9వ పీఆర్‌సీలో ఇచ్చిన వేతనాల స్థాయికి సమానంగా కాకుండా ఒక స్టేజీ పెంచి పైస్థాయి స్కేళ్లను నిర్ధారించారు.
 
 అత్యధిక పెంపుదల ఉన్న కేటగిరీలు
 ఎంపీడీవో, జూనియర్ లెక్చరర్, జిల్లా విద్యా శాఖాధికారి, ఉప విద్యాధికారి, మండల విద్యాధికారి, గ్రేడ్-1 హెడ్ మాస్టర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్, డిప్యూటీ ఐవోఎస్, అసిస్టెంట్ డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్, సీనియర్ లెక్చరర్, సూపరింటెండెంట్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్, ఆర్‌ఎంవో, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సీనియర్ అసిస్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్.
 
 వేతన సవరణ సంఘం నివేదికలోని వేతన వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement