
‘108’ సమ్మె ఉధృతం
వేతనాలు పెంచాలని, తీసేసిన సిబ్బందిని తిరిగి తీసుకోవాలని తదితర 15 డిమాండ్లతో జరుగుతోన్న ‘108’ ఉద్యోగుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది.
8 జిల్లాల్లో నిలిచిపోయిన వాహనాలు
అంబులెన్స్ రాకపోవడంతో
కరీంనగర్ జిల్లాలో మహిళ మృతి
విధుల్లో చేరకుంటే తొలగిస్తామని సిబ్బందికి జీవీకే హెచ్చరిక
అఖిలపక్ష సమావేశం, రిలే దీక్షలు చేస్తామని ఉద్యోగుల ప్రకటన
హైదరాబాద్: వేతనాలు పెంచాలని, తీసేసిన సిబ్బందిని తిరిగి తీసుకోవాలని తదితర 15 డిమాండ్లతో జరుగుతోన్న ‘108’ ఉద్యోగుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యోగుల సమ్మెకు వివిధ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే సీఐటీయూ, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు మద్దతు తెలిపాయి.
స్టాఫ్‌నర్సుల సంఘం కూడా మద్దతు ప్రకటించింది. అలాగే టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ కూడా మద్దతు తెలిపినట్లు ఉద్యోగులు తెలిపారు. త్వరలో అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. అప్పటికీ జీవీకే దిగిరాకుంటే రిలే నిరాహార దీక్షలు చేపడతామని వారు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఆదివారం ఒక్క అంబులెన్స్ కూడా రోడ్డెక్కలేదని తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లి అశోక్ చెప్పారు. దీంతో రోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు.
కరీంనగర్ జిల్లా ధర్మారంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని... కుటుంబ సభ్యులు 12 సార్లు ‘108’కు ఫోన్ చేయగా స్పందన కరువైందని... దీంతో ఆటోలో తరలిస్తుండగా ఆమె చనిపోయిందని వివరించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం యాజమాన్యం తక్షణమే స్పందించి సమ్మె నిలుపుదలకు కృషిచేయాలని ఆయన కోరారు.
ఎస్‌ఎంఎస్ రూపంలో నోటీసులు..
జీవీకే-ఈఎంఆర్‌ఐ యాజమాన్యం ఆదివారం ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో నోటీసులు జారీచేసింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సమ్మెలో పాల్గొంటున్న వారందరికీ ఎస్‌ఎంఎస్‌ల రూపంలో నోటీసులు ఇచ్చినట్లు జీవీకే-ఈఎంఆర్‌ఐ ఆపరేషన్స్ రాష్ట్ర అధిపతి బ్రహ్మానందరావు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటికే సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని కోరుతూ వచ్చామని... తాజాగా నోటీసులు జారీచేశామన్నారు.
ఆదివారం రాత్రిలోగా విధుల్లో చేరిన వారిని ఉపేక్షిస్తామని... లేకుంటే నిబంధనల ప్రకా రం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించా రు. మూడు విధాలుగా చర్యలుంటాయన్నారు. ఒకటి ఉన్నచోటు నుంచి బదిలీ చేయడం. రెండోది సంస్థ నష్టాలకు కారణమవుతున్నందున సమ్మెలో పాల్గొం టున్న ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేయడం. అయినా దిగిరాకుంటే చివరి అస్త్రంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. ఈ బెదిరింపులకు లొంగబోమని ఉద్యోగుల నేత అశోక్ స్పష్టంచేశారు.