breaking news
-
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇచ్చిన లెటర్లో ఏముందో రేవంత్‌కు తెలియదని, కానీ ఆ లెటర్‌ను చూసి ఏదో సాధించినట్లు మురిసిపోతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ కనీసం లెటర్ చదివే తెలివిలేదు సీఎం రేవంత్‌కు. సోనియా లెటర్లో ఏముందో తెలియకుండానే రేవంత్ మురిసి పొయిండు. సోనియా గాంధీ తనకు మెచ్చుకుంటూ ఉత్తరం రాశారని… కానీ చదువు రాక రేవంత్ రెడ్డి పరవశించి పోతున్నాడు. రేవంత్ కార్యక్రమాని రాలేకపోతున్న అని సోనియా రాసిన లేఖలో ఒక్క మాటకూడా రేవంత్ పై ప్రశంసనే లేదు. కార్యక్రమానికి రాలేను అన్న సోనియా మాటలే తనకు ఆస్కార్ అవార్డు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పుకుంటున్నారు. రేవంత్‌ను చూస్తూ జాలేస్తుంది’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.మిత్తి సహా చెల్లిస్తాంఫోన్ ట్యాపింగ్ విషయంలో తమపై విష ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అడిగితే డైవర్షన్ చేయడానికి అనవసరపు మాటలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని పోలీసుల్ని హెచ్చరించారు. ఈసారి ఎవ్వడు అడ్డుకున్న కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
‘బీసీ బిల్లుపై అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదు?’
ఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ శాతం కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై బీజేపీ వైఖరి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై బీజేపీకి అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఫ్యూడల్ ధోరణితో అన్యాయం చేస్తే తిరుగుబాటు చేస్తామని పొన్నం హెచ్చరించారు. ముస్లింల పేరుతో బీసీల నోటి కాడి కూడు లాక్కోవొద్దన్నారు పొన్నం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. కిషన్‌రెడ్డి, రామచంద్రరావులు బీసీ వ్యతిరేకులుగా పొన్నం పేర్కొన్నారు. తాము ఏ కుల సర్వే చేసినా....కేంద్రం చేసేది ప్రామాణికం అవుతుందన్నారు.ఆమోదిస్తారా?.. తిరస్కరిస్తారా?రాష్ట్రపతి వద్ద ఉన్న తెలంగాణ బీసీ బిల్లును ఆమోదిస్తారా?, తిరస్కరిస్తారా? అనేది ఏదో ఒకటి చెప్పాలని మరొక మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయవద్దని, ఈ బిల్లును ఆమోదించేందుకు కిషన్‌రెడ్డి సహకరించాలన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తే బీజేపీకి తెలంగాణలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు మంత్రి వాకిటి శ్రీహరి. సకల జనుల సమ్మె తరహాలో బీసీలు ఉద్యమిస్తారన్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు: కేటీఆర్
సాక్షి, కామారెడ్డి జిల్లా: దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో ఆత్మగౌరవ గర్జన సభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నడి బొడ్డున ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆరే. 26 శాతం ఉన్న దళిత గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మాటిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.కేసీఆర్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము.. రైతు రుణమాఫీ, 50వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే 12వేల కోట్లు మాత్రమే చెల్లించారు. ఢిల్లీకి మూటలు.. తెలంగాణ ప్రజలకు మాటలు. ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు. ఒకరు రాము, మరొకరు రెమో.. ఇద్దరి మాటలకు పొంతన ఉండదు’’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఏడాదికి 60 వేల ఉద్యోగాలు ఏమయ్యాయి?. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ ఏమీ చేయడం లేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బట్టలు విప్పండి. మిస్ వరల్డ్‌లో లక్ష రూపాయల చొప్పున సుందరంగులకు ప్లేట్ బోజనాలు పెట్టవు. మరి దళిత బిడ్డలు చదివే వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్‌ది పనికి రాని సర్వే.. రేవంత్‌వి పిల్లి మొగ్గలు: కిషన్‌రెడ్డి
ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసిందని ఆరోపించారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. బీసీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీసీని ప్రధానిని చేసిన ఘటన బీజేపీది అంటూ చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దేశానికి అత్యధిక కాలం పని చేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బీసీలను కాంగ్రెస్ మభ్య పెడుతోంది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం అమలు చేయడంలో ఫెయిల్ అయ్యింది. బీసీల్లో ముస్లింలను కలపడం వల్ల బీసీ వర్గాలకి అన్యాయం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీసీ సీట్లలో ముస్లింలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు ఇవ్వడం వల్ల నిజమైన బీసీలకు నష్టం జరుగుతుంది. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదు. కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసింది.బీసీలలో ముస్లింలను కలిపేలా కేంద్రం కుల గణన ఉండదు. బీసీలకు న్యాయం చేసేలా కుల గణన ఉంటుంది. కాంగ్రెస్ ఏనాడు బీసీ సీఎం, బీసీని ప్రధానిని చేయలేదు. బీసీని ప్రధానిని చేసిన చరిత్ర బీజేపీది. మోదీ కన్వర్టెడ్ బీసీ ఎలా అవుతారు?. కాంగ్రెస్ హయంలోనే మండల కమిషన్ ద్వారా మోదీ కులాన్ని బీసీల్లో చేర్చాలి. బీసీల్లో చేర్చినపుడు కనీసం మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక కులాలు బీసీల్లో కలిశాయి. లంబాడాలను కూడా కన్వర్టెడ్ ఎస్టీ అంటారా?.తెలంగాణలో ఎన్నికలొస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వారి ఓటమి ఖాయం. రాహుల్ గాంధీది ఏ సామాజిక వర్గమో చెప్పాలి. ఎన్నికైన ప్రధాని మోదీపై అవాకులూ చెవాకులూ పేలడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. 42శాతం రిజర్వేషన్లు బీసీలకు మాత్రమే ఇవ్వాలి. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేందుకు మాకు అభ్యంతరం లేదు కానీ చట్టానికి లోబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తాం. మెట్రో విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పిల్లి మొగ్గలు వేస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కేంద్రానిదే బాధ్యత: రాహుల్‌గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికే మార్గదర్శకమని, ఇందుకు సంబంధించి రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించే బాధ్యత కేంద్రంపైనే ఉందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిల్లును ఆమోదించే విషయంలో జాప్యం చేయరాదని అన్నారు. దేశంలో సామాజిక న్యాయానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే మైలు రాయిగా నిలుస్తుందని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కుల గణన సర్వేపై ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక సామాజిక, ఆర్థిక, రాజకీయ పనిముట్టు ‘కుల గణన అనేది రేవంత్‌రెడ్డికి అంత సులువు కాదని భావించాం. సీఎంగా ఇది ఆయనకు ఇబ్బందికరమని అనుకున్నాం. ఆయన సామాజిక వర్గం ఆయనను సమర్థించదని భావించాం. కానీ రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నేను ఆశించిన దానికంటే అద్భుతంగా పనిచేశారు. సరైన దృక్పథంతో సర్వేను పూర్తి చేశారు. బీజేపీ దీనిని ఇష్టపడినా, పడకున్నా.. దేశంలో కుల గణన చేపట్టేందుకు ఇది ఒక దిక్సూచిగా మారుతుంది. ఇది నాలుగు గోడల మధ్య చేయలేదు. తెలంగాణలోని లక్షల మంది ప్రజలు, అన్ని వర్గాలను 56 ప్రశ్నలు అడిగి సర్వే చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సర్వే జరగలేదు. 21వ శతాబ్దపు సామాజిక, రాజకీయ, ఆర్థిక డేటా తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ సర్వే వివరాల ఆధారంగానే కులం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదొక సామాజిక, ఆర్థిక పనిముట్టు. బీజేపీకి ఇష్టం లేకపోయినా ఇదొక రాజకీయ పనిముట్టు..’ అని రాహుల్ అభివర్ణించారు. కుల గణనను కేంద్రం సరిగా చేయదు ‘ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ల అడ్డుగోడను తొలగించే అవసరం వచ్చింది. కానీ దీనిని కేంద్రం విస్మరిస్తోంది. కుల గణన సర్వే వివరాల ఆధారంగా తెలంగాణలో జరిగే అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందుత్వ పేరుతో స్థానిక రాజకీయాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అడ్డుగోడ సామాజిక అభివృద్ధికి విఘాతంగా మారింది. ఈ అడ్డుగోడను తొలగించే విషయంపై నేను, రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాం. మాకు తెలిసినంత వరకు కుల గణనను కేంద్రం సరైన రీతిలో నిర్వహిస్తుందని అనుకోవడం లేదు. వాళ్లు అలా చేయరు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీల వాస్తవ పరిస్థితులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి లేదు. కులగణన వాస్తవాలు వారు ఎప్పుడు బయటకు వెల్లడిస్తారో అప్పుడు బీజేపీ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది..’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లీష్ వద్దా? ‘దేశాభివృద్ధికి డబ్బు, భూములు కాదు.. ఇంగ్లీష్ విద్యే మార్గం. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకు ముందు భూములే విలువైనవని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఇంగ్లీష్ ప్రాధాన్యమైన అంశం అని కుల గణన నిపుణుల కమిటీ చెప్పినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం..అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు అక్కర్లేదని నేను చెప్పడం లేదు. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ వద్దంటారు. వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. ఇంగ్లీష్ మీడియం అనే సమాధానమే వస్తుంది. మరి ఆ అవకాశాన్ని దేశంలోని వెనుకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నేతలు ఎందుకు ఇవ్వరు?..’ అని రాహుల్ నిలదీశారు. రేవంత్‌రెడ్డి తదితరులను అభినందిస్తున్నా.. ‘రాష్ట ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం అడ్డుగోడను తొలగించాలనుకుంటున్నట్లు అందులో పేర్కొంది. అయితే అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పకోవడం లేదు. దీనిని పార్లమెంటులో లేవనెత్తడమే మన కర్తవ్యం. రేవంత్‌రెడ్డి చేసిన దాన్ని మనం ప్రోత్సహించాలి. సర్వే నిర్వహించిన రేవంత్‌రెడ్డి, నిపుణుల కమిటీ, కాంగ్రెస్ నేతలను నేను అభినందిస్తున్నా. జరిగిన దానిని ఖర్గే పెద్దగా సమర్థించలేదు. అయినప్పటికీ ఆయనకు కూడా నా ధన్యవాదాలు..’ అని రాహుల్ అన్నారు. భవిష్యత్తు లేదనే కేంద్రం కులగణన నిర్ణయం: ఖర్గే ఓబీసీలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఉండదని గమనించే దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను భాగం చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్ జోడో యాత్ర, సంవిధాన్ బచావ్ ర్యాలీల్లో రాహుల్‌గాం«దీకి ఓబీసీలంతా మద్దతు ఇచ్చారు. ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అనే రాహుల్ నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభం జరిగింది. ఇది గమనించిన ఇతర పార్టీలు తమకు భవిష్యత్తు లేదని భావించి మన బాటలో నడుస్తున్నాయి. కేంద్రం తీసుకున్న జనగణనలో కులగణన నిర్ణయం అందుకు నిదర్శనం. కుల గణన సర్వే తెలంగాణ సాధించిన పెద్ద విజయం. ప్రభుత్వం చేసిన కుల గణన దేశానికి దిశానిర్దేశం చేసింది. కుల గణన చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన చర్య. రాజకీయంగా శక్తి లభించింది కాబట్టే రేవంత్‌రెడ్డి ఇది చేయగలిగారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి బ్లాక్‌కు తీసుకెళ్లాలి. పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నేతలంతా ఈ బాధ్యత తీసుకోవాలి. అందరి ఎక్స్‌రే తీశారు కానీ.. ఈ సర్వేలో అంటరానివారే లేరని సీఎం, మంత్రులకు చెప్పాను. బీసీలు సామాజికంగా వెనుకబడ్డారు. కానీ దళితులు అంటరానివారిగా ఉన్నారు. అలా ఉన్నామని భావిస్తున్నారు. ఈ అంతరాన్ని చెరిపేయాలి. వీరిని ఒక్కతాటి పైకి తీసుకురావాలి. ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన వారందరికీ అభినందనలు. భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో కుల గణనను ప్రోత్సహించిన రాహుల్ గాందీని అభినందిస్తున్నా. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే ప్రధాని మోదీ దేశ వ్యాప్త జన గణనలో కుల గణనను భాగం చేస్తూ దిగిరాక తప్పలేదు..’ అని ఖర్గే పేర్కొన్నారు. -
అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు నేడు(జులై 24). ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. పార్టీ నేతలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా.. ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి’’ అని పోస్ట్ చేశారామె. కవితకు, కేటీఆర్‌కు మధ్య గతకొంతకాలంగా నెలకొన్న గ్యాప్ సంగతి తెలిసిందే. తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖలో.. కేవలం ట్వీట్లు చేయడంతోనే ఆగిపోకూడదంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె విమర్శలులు గుప్పించారు. అదే సమయంలో పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదంటూ కవితకు కేటీఆర్ చురకలంటించారు. ఈ క్రమంలో సోదరుడి పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.Annayya Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు సీఎంవో అధికారిక ఖాతా ద్వారా తెలియజేసింది.సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/Bu7MCvtg7S— Telangana CMO (@TelanganaCMO) July 24, 2025కేటీఆర్ ఫ్లెక్సీల తొలగింపుకేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీల ఏర్పాటు చేశాయి. అయితే జీహెచ్ఎంసీ వాటిని తొలగిస్తోంది. ఈ చర్యపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతోంది.ఇదీ చదవండి: నాతో పెట్టుకోవద్దు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత! -
‘అసెంబ్లీ’కి ప్రీఫైనల్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ప్రీఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన కేడర్‌ను గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. వికారాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, బాల్కొండ పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో గూండాలు రోడ్డు మీద షో చేసినా పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధిస్తే అధికారులందరూ తమ పద్ధతి మార్చుకుంటారన్నారు. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలుపొందితే అధికారుల వేధింపులకు అవకాశం ఉండదని చెప్పారు. కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం ‘పదేళ్ల అధికారాన్ని తపస్సుగా భావించి తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసే క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోలేదనేది వాస్తవం. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పును పునరావృతం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చాం. మీ సేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను కూడా పెద్దసభలు పెట్టి పంపిణీ చేస్తూ రేవంత్ గొప్పగా చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నూలి శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. -
కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం మెడలు వంచి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ అంశంలో కేంద్రాన్ని ఒప్పించేలా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి పక్షాల నేతల మద్దతును సైతం కూడగడతామని చెప్పారు. తద్వారా ఒత్తిడి పెంచుతామని, ఒత్తిళ్లకు లొంగని పక్షంలో ప్రధాని మోదీని కుర్చీ దింపి, తమ నేతను కుర్చీలో కూర్చోబెట్టి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని, ఓబీసీ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర ఎంపీలతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రెండు బిల్లులు పంపించాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే పూర్తి చేసింది. అందులో వెల్లడైన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆ మేరకు రిజర్వేషన్ల కోసం ఒకటి, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒకటి..ఇలా శాసనసభలో రెండు బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఈ విషయంలో సహకరించాలని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రం తాత్సారం చేస్తోంది.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నాం. అయితే కేంద్రం ఆమోదించకుండా తాత్సారం చేస్తోంది. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే, కాంగ్రెస్ అనేక పోరాటాలు చేసి వాటిని వెనక్కి తీసుకునేలా చేసింది. కులగణనను చేయబోమన్న కేంద్రాన్ని జనగణనలో కులగణనను భాగం చేసేలా ఒప్పించింది. అదే మాదిరి ఇప్పుడు కూడా కేంద్రం మెడలు వంచుతాం. మా అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేయాలన్న ఉద్దేశంతో నేను, మా ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వచ్చాం. వారిని కలవడంతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరినీ కలిసి రాష్ట్రంలో నిర్వహించిన సర్వే గురించి వివరిస్తాం. అలాగే ఇండియా కూటమిలోని ఇతర సభ్యులను కలుస్తాం. సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. గురువారం కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని అంటున్నరు. అసలు అఖిల పక్షం ఎక్కడుంది? ప్రధాన ప్రతిపక్ష నేత నిద్రపోతున్నడు. ఆయన పిల్లలు కొట్లాడుకుంటున్నరు. తాను చెడిన కోతి వనమెల్లా చెరిచినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకేం అఖిలపక్షం. బీజేపీ రిజర్వేషన్లు వద్దంటోంది. ఎంఐఎం మద్దతిస్తోంది. బీజేపీది వితండ వాదం.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వితండ వాదం చేస్తోంది. ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తే, కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు మాత్రం వితండ వాదం చేస్తున్నారు. బీజేపీకి ఒకటి, కాంగ్రెస్‌కు మరొక రాజ్యాంగం లేదు. అంబేడ్కర్ రాజ్యాంగమే అందరికీ అమలవుతోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తే మద్దతు ఇస్తామని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అంటున్నారు. వాళ్లకు కనీస అవగాహన లేదు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లిం రిజర్వేషన్లు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన తర్వాత తెలంగాణకు అలా సూచించండి. గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్న అమిత్ షాను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తారా? మొండి, తొండి వాదనను పక్కనబెట్టాలి. బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. వచ్చే ఎన్నికలు లిట్మస్ టెస్టువంటివి 2029 లోక్‌సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్ వంటివి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడా ఇవ్వలేదు. కేవలం వెనుకబాటుతనంలో ఉన్నవారికే రిజర్వేషన్ ఇస్తున్నాం. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట మంత్రివర్గంలో చర్చించి త్వరలో శాసనసభలో ప్రవేశపెడతాం. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తర్వాత మొత్తం 50 శాతం రిజర్వేషన్లే అనేది ఎప్పుడో పోయింది. కొందరు వితండవాదులు చేసే వాదనలకు కోర్టులే సమాధానం చెబుతాయి. మొదట రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత సబ్ కేటగిరైజేషన్ గురించి ఎక్స్పర్ట్ కమిటీ చర్చిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. తప్పులు సరిదిద్దుకోవాలంటే దత్తాత్రేయకు చాన్స్ ఇవ్వాలి ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి. గతంలో వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రపతి చేసే అంశంపై చర్చ జరిగింది. ఆయనను ఢిల్లీ నుంచి వెనక్కి పంపించేశారు. తెలుగు మాట్లాడే ఆయనను ఘర్‌వాపసీ చేయించారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తెలంగాణ నేత, సౌమ్యుడైన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. గవర్నర్‌గా ఆయన పదవీకాలం పూర్తయింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించారు. ఇప్పుడు ఆ పదవి బ్రాహ్మణుడైన ఎన్.రామచందర్‌రావుకు ఇచ్చారు. బీజేపీ తెలంగాణలోని ఓబీసీ నేతల గొంతు కోసింది. ఈ తప్పులన్నింటినీ క్షమించాలంటే దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున దత్తాత్రేయకు, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి అందరి ఆమోదం ఉంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ గౌరవించాలి. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారంట.. మీడియా సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారని తెలుస్తోంది. సొంతింటి వాళ్లవి చేసేకన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం. నా ఫోన్ ట్యాప్ అయిందో? లేదో నాకు తెలియదు. నా ఫోన్ ట్యాప్ అయ్యుంటే నన్ను విచారణకు పిలిచివారు కదా. ఒకవేళ సిట్ విచారణకు పిలిస్తే కచ్చితంగా వెళతా. మా ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్‌లు చేసే ఉద్దేశం లేదు. దానివల్ల ఒనగూరేది లేదు. ఇది గత ఎన్నికల్లోనే రుజువైంది..’అని అన్నారు. నిబంధనల మేరకే సీఎం రమేశ్ కంపెనీకి కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీలో రోడ్ల కాంట్రాక్టు టెండర్‌ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు ఇవ్వడంపై ప్రశ్నించగా.. ‘రూ.1,600 కోట్ల ఈ–టెండర్‌ను నిబంధనల మేరకే వారి కంపెనీ దక్కించుకుంది. ఎల్అండ్టీ సైతం ఈ–టెండర్లో పాల్గొంది. నా మిత్రుడని ఈ టెండర్ కట్టబెట్టలేదు. ఓపెన్ టెండర్లోనే వారికి దక్కింది..’అని రేవంత్ వివరించారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి ఎక్కడా రుణాలు తీసుకోలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వ సావరిన్ బాండ్లను వేరే కంపెనీలు కొనుక్కున్నాయని స్పష్టం చేశారు. -
‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు’
సాక్షి,హైదరాబాద్: పోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్‌చాట్‌లో ‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నానని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వినాల్సి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమం. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే లీగల్‌గా పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సిట్ అధికారులను డిక్టేట్ చేయను. నాఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా.ఫోన్ టాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తా. ట్యాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదు. రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా...స్థానిక ఎన్నికలు ఆగవు.ఈ విషయంలో మా రాజకీయ వ్యూహం మాకుంది’ అని తెలిపారు. -
రాజాసింగ్‌కు ఒక్క మిస్డ్‌కాల్ చాలు.. బండి-ఈటల వివాదంపై ధర్మపురి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ రాజీనామా అంశంతో పాటు ఈటల-బండి మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌పైనా అరవింద్ స్పందించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయన పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడుతూ.. ‘‘బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై న్యూట్రల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈ అంశంపై మాట్లాడాలి. అవసరమైతే అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకోవాలి’’ అని ధర్మపురి హైకమాండ్‌ను కోరారు.ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘‘రాజాసింగ్ ఐడియాలాజికల్ మ్యాప్. కొన్ని విషయాల్లో మనస్థాపం చెందారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు రాజీనామా చేశారు. ఒకవేళ ఆయన మళ్లీ పార్టీ సభ్యత్వం కావాలనుకుంటే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మళ్లీ మెంబర్షిప్ వస్తుంది. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి.. ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. ఆ కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు ఇదే మంచి సమయం. ఇందూర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేం గెలుస్తున్నాం. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు. బీసీ రిజర్వేషన్లపై ముందుగా సుప్రీం కోర్టులో కొట్లాడాలి అని ఎంపీ అరవింద్ అన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో పదేళ్ల లొల్లి!
తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్‌లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే.. సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు. 2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు. కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్‌కే సీఎం సీటు తిరిగి దక్కింది. 1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్ పాలించలేదన్నమాట. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తులు రేవంత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్ కర్నూల్ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు. సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మద్దతు కూడగడతాం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వెనుక బడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కోసం ప్రయత్నిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సహేతుకమని భావించే ప్రతీ రాజకీయ పార్టీని కలుస్తామన్నారు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరతామని, అందరి మద్దతూ కూడగడతామని చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి పార్టీలను కలిసి మద్దతు కోరతామని చెప్పారు. శతాబ్దాల నుంచి అన్యాయం జరుగుతున్న వర్గాలకు న్యాయం చేసే దిశలో తాము మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరిస్తారనే ప్రగాఢ నమ్మకం ఉందని చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చించినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మద్దతిచ్చాయని, ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఆ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. ఈ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం కోరినా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అన్నీ వివరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో అనుసరించిన శాస్త్రీయ పద్ధతులను దేశంలోని పార్లమెంట్ సభ్యులకు వివరిస్తామని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. గతంలో జరిగిన సర్వేల అనుభవాలు, తాము నిర్వహించిన పైలట్ సర్వే, సర్వే ప్రశ్నావళి రూపకల్పన, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశాలు, ఎన్యూమరేషన్ ప్రక్రియ, డేటా ఎంట్రీతోపాటు ఈ సర్వేను స్వతంత్ర నిపుణల కమిటీతో అధ్యయనం చేయించిన తీరును అందరికీ అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. మొత్తం 88 కోట్ల పేపర్లలో నిక్షిప్తమైన కులగణన సమాచారాన్ని సరళీకృతం చేసిన అనంతరం అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించామని చెప్పారు. నిపుణల కమిటీ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీలో, కేబినెట్లో పెట్టి ఆమోదించిన తర్వాత ప్రజల ముందుకు తెస్తామని వెల్లడించారు. ఆయన అడ్డుకునేలా మాట్లాడతారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుకు దళితులన్నా, బీసీలన్నా చిన్నచూపు ఉన్నట్టుందని భట్టి వ్యాఖ్యానించారు. అందుకే ఆయా వర్గాలకు మేలు చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరిగినా ఆయన అడ్డుకునే విధంగా మాట్లాడతారన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము చెప్పామని, చేశామని అన్న భట్టి.. తామే చెప్పాం కాబట్టి తామే చేసుకోవాలని రాంచందర్‌రావు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. తామేమీ బీజేపీ అంతర్గత వ్యవహారాల గురించి అడగడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే ప్రక్రియ గురించి అడుగుతున్నామని చెప్పారు. రాంచందర్‌రావు పంపిన లీగల్ నోటీసులు అందాయా అన్న ప్రశ్నకు భట్టి సీరియస్‌గా స్పందించారు. ‘లీగల్ నోటీసులకు భట్టి భయపడడు. నేను ఏం మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నా. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీగా, వ్యక్తిగా ఏం చెప్పాలో తెలుసు’ అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీకి చిత్తశుద్ధి లేకపోతే ఇంత ప్రక్రియ ఎందుకు చేస్తామని, ఈ అంశాన్ని ఇంత దూరం తీసుకొచ్చామంటేనే తమ చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని భట్టి చెప్పారు. నాడు అవసరం లేదన్న వారే..అసలు కులగణన అవసరమే లేదని పార్లమెంటులో చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. తెలంగాణలో జరిగిన సర్వే అనంతరం దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణన చేయాలనే నిర్ణయానికి వచ్చారని భట్టి చెప్పారు. ‘తెలంగాణలో జరిగిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన (సీప్యాక్స్) దేశంలోనే ఒక చారిత్రక సర్వేగా నిలిచిపోనుంది. సర్వే వద్దన్న మోదీ తెలంగాణ సర్వేతోనే ఒప్పుకునే స్థితికి తీసుకొచ్చాం. ఈ ప్రక్రియకు ఆద్యుడైన రాహుల్‌గాంధీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం అనుసరించేలా చేశాం. ఇక దేశంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ రాష్ట్రంలో సర్వే జరిగినా తెలంగాణను మోడల్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా శాస్త్రీయంగా ఈ సర్వే చేశాం’ అని భట్టి చెప్పారు. -
‘ మీ పార్టీ సీఎంకి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు?’
ఢిల్లీ: పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శకాలు తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి 46సార్లు ఢిల్లీకి వచ్చినా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదని విమర్శించారు. ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు రేవంత్‌రెడ్డికి సమయం ఇచ్చారన్నారు. మరి మీ పార్టీ సీఎంకు మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు రామచందర్‌రావు. తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని, న్యాయపరమైన చిక్కులు తెలిసి ... బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చాం.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రామచందర్‌రావు స్పష్టం చేశారు. -
నాపై దాడికి యత్నించింది మా పార్టీ వారే!: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంచలన ఆరోపణలకు దిగారు. తన పార్టీకి చెందిన వారే తనపై దాడికి యత్నించారని అన్నారాయన. ఈ విషయంపై సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దుండగులు దాడికి యత్నించారు. మాణికేశ్వర్‌నగర్‌లో ఫలహారం బండి ఊరేగిస్తుండగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే గన్మెన్ల సమయస్పూర్తితో ఆయన దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై సాక్షితో సోమవారం ఆయన మాట్లాడారు. ‘‘నాపైన ఉద్దేశ్యపూర్వకంగా దాడి ప్రయత్నం జరిగిందనే అనుమానం ఉంది. నా నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన ఓక నేత(గొల్లకిట్టు) నన్ను టార్గెట్ చేశారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీని కలిసి ఫిర్యాదు చేశా. ఆ వెంటనే నా సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశారు. నిన్న నాపై దాడికి ప్రయత్నం చేసిన వారంతా బయట నియోజకవర్గానికి చెందిన వారే. అందులో ముగ్గురిని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చా. అయితే.. ఇది పార్టీ పెద్దలకు చెప్పేంత పెద్ద ఇష్యూ కాదన్న ఆయన.. మళ్ళీ పోలీసులను కలిసి అన్ని వివరాలు చెప్తానన్నారు. ఆదివారం సాయంత్రం.. నియోజవర్గంలోని మాణికేశ్వర్‌నగర్‌లో ఫలహారం బండి ఊరేగిస్తుండగా ఎమ్మెల్యే శ్రీగణేశ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై దాదాపు 20 మంది దాడియత్నం చేశారు. అద్దాలు దించాలంటూ కారును వెంబడించారు. అప్రమత్తమైన గన్మెన్లు వాహనాన్ని నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. ఈ ఘటనపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. -
పదేళ్లు సీఎంననడం అభ్యంతరకరం
నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై మరోమారు విరుచుకు పడ్డారు. మరో పదేళ్ల పాటు తానే సీఎంనని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’.. అని రాజగోపాల్‌రెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. -
‘కేటీఆర్.. అది మా డైలాగ్.. కాపీ కొట్టావ్’
హైదరాబాద్. రాష్ట్రంలో తమ ఫోన్లు సహా పలువురు ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించడమే కాకుండా దీనిపై లైడిటెక్టర్ పరీక్షలు రావాలంటూ సవాల్ చేశారు. ఈ అంశానికి సంబంధించి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? మగాడివైతే రా అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు కేటీఆర్. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ‘ మగాడివైతే రా అని కేటీఆర్ సవాల్ చేయడం సూట్ కాలేదు. ఇది మా డైలాగ్.. నువ్వు కాపీ కొట్టావ్’ అంటూ చమత్కరించారు. ‘రేవంత్ రెడ్డి వస్తే...నువ్వు తట్టుకోగలవా కేటీఆర్. రేవంత్ రెడ్డి నాటు కోడి , కేటీఆర్ బ్రాయిలర్ కోడి. కేటీఆర్ మీ హాయాంలో బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేస్తారు.. అప్పుడు ఏం చేశావ్. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంను మేము విమర్శిస్తే.. దానికి కారణం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు కాని హామీలపైనే విమర్శలు చేశాం. అసెంబ్లీలో ప్రశ్నిస్తే కోమటిరెడ్డి, సంపత్‌లను సస్పెండ్ చేశారు. మాకైతే అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశమే ఇవ్వలేదు. మల్లన్న సాగర్లకు పోయేవారి పైన లాఠీలు విరగొట్టారు. పదేళ్లు దుర్మార్గపు పాలన సాగించారు. హరీష్ రావు మీ నియోజకవర్గ ప్రజలు ఎన్ని సార్లు ఫ్రీ బస్సు వాడుకున్నారో లెక్క తీద్దమా. సీఎం రేవంత్ వస్తారు.. కేసీఆర్‌ను రమ్మనండి,. గజ్వేల్‌లో మహిళలు ఫ్రీ బస్సు ఎక్కారో లేదో తేల్చుకుందాం. గతంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరిగేవి. ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. .మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడా.?, రూ.500కే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పై చర్చకు సిద్దమా కేటీఆర్. మహిళా సంఘాలకు మా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం బిఆర్ఎస్ నేతలకు ఉందా?, సంపన్నులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్నాం. పేద పిల్లలకు కార్పోరేట్ విద్య అందించేందుకు ఓక్కో నియోజకవర్గంలో రూ. 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు ఏరోజైనా కేసీఆర్ చేసాడా?, అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. -
‘జనం కోరుకున్నారు.. సీఎం చెప్పారు’
హైదరాబాద్: ‘వచ్చే 10 ఏళ్లు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు’ అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి సృష్టించాయి. అవకాశం దొరికినప్పుడల్లా వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రినని రేవంత్ చెప్పుకుంటూ ఉన్నారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉండగా, తాజాగా రాజగోపాల్ రెడ్డి బయటపడ్డారు.ప్రధానంగా రేవంత్ మళ్లీ తానే ముఖ్యమంత్రినని ఎలా చెప్పుకుంటారని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ స్పందించారు. రేవంత్ 10 నుంచి 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలనేది కొల్లాపూర్ ప్రజలు కోరుకున్నారని, రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే తమ జిల్లా పెండింగ్ పనులు అవుతాయని సభకు వచ్చిన ప్రజలు కోరుకున్న నేపథ్యంలోనే అలా వ్యాఖ్యానించారని సంపత్ కుమార్ చెప్పుకొచ్చారు. జనం చెప్పిన దాన్నే సీఎం సభలో చెప్పారని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి సంగతి అధిష్టానం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025 కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చురకలంటిచారు సంపత్ కుమార్. కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయని, ప్రస్తుతానికి కేటీఆర్ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివామని, ఇంకా చాలా కథ ఉందంటూ సెటైర్లు వేశారు. ‘కేటీఆర్ నీకంటే ఎక్కువ బాష మాట్లాడగలను... తట్టుకోలేవు. లోకేష్‌ను కలవలేదంటవ్...కలిస్తే తప్పేంటి అని నువ్వే అంటవ్...రేవంత్ రెడ్డి మొనగాడు. మొగాడు కాబట్టే మిమ్మల్ని మట్టి కరిపించాడు.సీఎంను ఉద్దేశించి మాట్లాడే పద్దతి నేర్చుకో కేటీఆర్’ అని సూచించారు. -
అంత నిస్సహాయ స్థితిలో ఏం లేను.. ఈటల ‘కోవర్టు’ వ్యాఖ్యల కలకలం
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు తప్పవని.. వాటిని తట్టుకుని నిలబడితేనే నిలదొక్కుకోగలమని హుజూరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవా? అనే చర్చ జోరందుకుంది.సాక్షి, మేడ్చల్-మల్కాజ్గిరి: హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల ఆవేదన తనకు అర్ధం అయ్యిందని.. వాళ్ల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో తాను లేనని అన్నారాయన. శనివారం శామీర్‌పేట నివాసంలో ఆయన హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ రాదు. మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం రాదు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదు. హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు. మనకు మనంగా భీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదు. 2021లో ఆ పార్టీ నుంచి నరకం అనుభవించా. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి.. అవి తట్టుకుందాం. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. అయితే హుజురాబాద్‌లో ఓడిపోతా అని ఊహించలేదు. శత్రువుతో నేరుగా కోట్లాడతా. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో ఉంటా. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. కాలం చాలా గొప్పది. హుజురాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు. హుజురాబాద్‌లో 2019 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 53 వేల మెజార్టీ వచ్చింది. వ్యక్తులు ఎదకుండా ఏ పార్టీ బలపడలేదు. కార్యకర్తల ఆవేదన అర్ధం అయ్యింది. వాళ్ల రాజకీయా అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను. కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. అబద్ధపు పునాదులపై బతుకుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. వీధి పోరాటాలు మనకు అవసరం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది. నేను రాకముందు బీజేపీకి హుజురాబాద్‌లో కేడరే లేదు. నేను వచ్చాకే కరీంనగర్లో బీజేపీకి 50వేల మెజారిటీ. హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో మనవాళ్లే ఉంటారు. కురుస స్వభావులను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదు. ఉన్నదాంట్లో గుర్తించి మనకి పదవులు వస్తాయి. ఎవరి దయాదక్షిణ్యాలు మనకు అవసరం లేదు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు. వారి గురించి బాధపడకండి..హుజురాబాద్ వస్తా.. మీ వెంటే ఉంటా.. మిమ్మల్ని గెలిపించుకుంటా. ఇక నుంచి పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తలు మరుగుజ్జులు కాదు.. కుంగిపోవద్దు. రోశయ్య ,కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళతోనే కొట్లాడిన. సముద్రంలో తుపాను వచ్చే ముందు సైలెంట్‌గా ఉంటుంది. నాలాంటి వాళ్ళు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుంది. నేను ప్రజల నుంచి వచ్చిన వాడ్ని. ప్రజలే నాకు న్యాయ నిర్ణేతలు’’ అని ఈటల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లపై బీజేపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
బాబు, రేవంత్ దాగుడు మూతలు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యులని ప్రతీతి. అప్పుడప్పుడూ ఈ ప్రచారాన్ని రేవంత్ తోసిపుచ్చుతున్నట్లు కనిపించినా.. కొన్ని సందర్భాల్లో అది నిజమే అన్నట్టుగానూ ఉంటుంది. విభజన సమస్యలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్తు బకాయిల వంటి ముఖ్యమైన అంశాలపై కాకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఏదో పెద్ద విపత్తు అయినట్లు ఇరువురూ ఢిల్లీలో సమావేశం కావడం ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, ఆ తరువాత వచ్చిన వార్తలు, నేతలు చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. రేవంత్ ఏదో మొహమాటానికి ఢిల్లీ వెళితే.. శిష్యుడిని మేనేజ్ చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసినా చంద్రబాబు దీనికి బదులేదీ ఇచ్చినట్టు లేదు. పైగా.. ఏదో కమిటికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు చంద్రబాబు తన కేబినెట్ మంత్రి రామానాయుడితో చెప్పించడం రేవంత్‌ను ఇబ్బందిపెట్టే విషయం అయిపోయింది. బదులుగా రేవంత్ మరోసారి తన వాదన వినిపించి ఆత్మరక్షణలో పడితే.. చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా రాయలసీమలో ఒక నీటి విడుదల కార్యక్రమానికి వెళ్లి కూడా బనకచర్ల ప్రస్తావన చేయకపోవడం ద్వారా డిఫెన్స్‌లో పడినట్లు విశ్లేషించుకోవాలి. తద్వారా చంద్రబాబు బనకచర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించే ఆస్కారం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు కొన్ని నెలలుగా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ చాలా కష్టమని అంతా భావిస్తున్నారు. అందులోను పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ అంగీకరించిందన్న వార్తల నేపథ్యంలో ఆ సందేహం మరింతగా బలపడుతోంది. దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బనకచర్ల డ్రామాకు తెరతీయగా, రేవంత్ పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాపై తాము అంగీకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అనుమతే లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని కూడా అభిప్రాయపడింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో బనకచర్ల అజెండాలో ఉంటే రేవంత్ వెళతారా? లేదా? అన్న ప్రశ్న వచ్చింది. ఒకవేళ వెళ్లినా బనచర్ల అజెండా అయితే రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బృందం బాయ్ కాట్ చేస్తుందని కూడా లీక్ ఇచ్చారు. ఎలాగైతేనేం కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సత్కరించుకున్నారు. కేంద్ర మంత్రిని సన్మానించారు. బాగానే ఉంది. కాని బయటకు వచ్చి సమావేశం వివరాలను చెప్పిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని ఏపీ చెబితే కదా.. తాము ఆపాలని చెప్పాల్సింది అని ఆయన అన్నారు. పైగా ఇదసలు అనధికార సమావేశమని అనడం ఆసక్తికరంగా ఉంది. కేంద్రం ఇలా అనధికార సమావేశాలు పెడుతుందా? కేంద్ర మంత్రి అంత పని లేకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి హైదరాబాద్‌లోనో, అమరావతిలోనో భేటీ జరుపుకున్నా సరిపోతుంది కదా? అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సీఎంలు పరిష్కరించుకోలేని సమస్యలను అధికారులు తీర్చగలుగుతారా! అనే సందేహం వస్తుంది. అది వేరే విషయం. రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. బనకచర్లకు సంబంధించి సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అన్నారు. అది నిజమా? కాదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ చెప్పినదాని ప్రకారం అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల గురించి ఏమీ తెలపలేదు. దాంతో చంద్రబాబు బృందం ఇన్నాళ్లు చేసిన హడావుడంతా ఒట్టిదేనా అన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్‌లో రేవంత్ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందన్న ప్రశ్నను బీఆర్ఎస్ వేస్తోంది. సీఎంల భేటీ అజెండాలో బనకచర్ల అంశం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అటువంటప్పుడు అజెండాలోని అంశంపై ఎవరూ మాట్లాడలేదా?, తెలుగుదేశం మీడియా ఏపీ ఎడిషన్లలో చంద్రబాబు బనకచర్ల గురించి మాట్లాడారని, తెలంగాణ ఎడిషన్లలో ఆ ఊసే లేదన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఒకవేళ చర్చ జరిగి ఉంటే, రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. మాట్లాడకుండా ఉండి ఉంటే చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పినట్లు? రేవంత్ ప్రకటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. అలాగే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ స్పందించాలి. రేవంత్ రెండో రోజు కూడా దీనిపై కొంత స్పష్టత ఇచ్చినా, చంద్రబాబు నోరు మెదపలేదు. తనకు అనుకూలంగా ఉంటే చంద్రబాబు ఈపాటికి ప్రచారంతో హోరెత్తించే వారు. కాని ఆయన అలా చేయకపోవడం, రాయలసీమ టూర్లో కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైనట్లు అనిపిస్తుంది. కేంద్రమైనా వాస్తవం ఏమిటో వెల్లడిస్తుందా? లేదా? రేవంత్, నిమ్మలతోపాటు కేంద్రం కూడా ఒకే తరహా ప్రకటన చేసి ఉంటే ఈ గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. అలా కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో వారికే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇక ఇద్దరు సీఎంలు కూర్చుని అంగీకరించినట్లు చెబుతున్న టెలిమెట్రీ ఏర్పాటు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, విజయవాడలో కృష్ణా బోర్డు ఉండాలన్న నిర్ణయం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులకు ఏపీ అంగీకారం వంటివే ప్రధాన చర్చాంశాలై ఉంటే మాత్రం ఇది కాలక్షేపపు సమావేశమే అవుతుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నవే. కాగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లు ఉండాలని, కాని చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నీటి మట్టానికి పరిమితమైతే బనకచర్ల ప్రాజెక్టుకు నీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాని అన్నిటికి దబాయించడమే పద్దతిగా పెట్టుకున్న చంద్రబాబు టీమ్ వీటిపై ఎంతవరకు వాస్తవాలు వెల్లడిస్తుందన్నది సందేహమే. ఏతావాతా చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఆలపించినట్లు టీడీపీ మీడియాలో రాయించుకున్నారా? అన్న భావన కలుగుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్‌కు బిగ్ షాక్.. రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎవర్ని వదిలిపెట్టం.. కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడిన 141వ డివిజన్ (గౌతమ్ నగర్) కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్‌ను కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించామని.. రెండో సారి కూడా తిరుగులేని విజయం సాధించామన్నారు.హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా రాలేదనే కారణంతో కాంగ్రెస్ గుండాగిరి రాజ్యం తెస్తోంది. మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్లు దేవుడి కార్యక్రమానికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో గొడవ చేస్తారా? మీ అడ్డా అని వీర్రవీగుతున్నారా?. అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలి పెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. గుండాల్లాగా రాజకీయం చేస్తూ బస్తీ మే సవాల్ అంటూ సవాల్ చేస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసులు కొంత మందికి తొత్తులుగా మారారు. మేము మిమ్మల్ని వదలం. మా కార్యకర్తలు తరలి వచ్చి మీ అంతు చూస్తాం. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రాలేదని ఇష్టానుసారంగా చేస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్లు చేయటం లేదు’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాలమూరు అంటే కేసీఆర్‌కు చిన్నచూపు: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: కృష్ణా జలాలు పొలాల్లో పారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నారంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఎందుకు న్యాయం చేయలేదంటూ ప్రశ్నించారు. పాలమూరులో ప్రాజెక్టులకు డిసెంబర్లో భూములు సేకరిస్తాం. రెండేళ్లలో ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి చూపిస్తాం’’ అని రేవంత్ అన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభ ప్రసంగించారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్లు కాలేదు అప్పుడే దిగిపో.. దిగిపో అంటున్నారు. పాలమూరు అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపు. కరీంనగర్ నుంచి పారిపోయిన కేసీఆర్ ఆదరిస్తే సున్నం పెట్టారు. వాల్మికీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?. చెప్పులు కుట్టమని, గొర్రెలు పెంచమని చేపలు పట్టమని చెప్పారు. ఆయన బిడ్డలే రాజ్యాలు ఏలాలా? పాలమూరు బిడ్డలకు పదవులు వద్దా?. మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్‌కు కడుపుమంటగా ఉంది. 25 వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్ట్‌లు పూర్తయ్యేవి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది’’ అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
సాక్షి,ఖమ్మం: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని ఉత్తమ్,పొంగులేటి,భట్టి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా?.దమ్ముంటే దీనికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డికి సరిగా కేసులు కూడా పెట్టడం రాదు. మాపై దొంగ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్,కారు రేసింగ్ అని తప్పులు పెడుతున్నారు. లీకులు తప్ప ఆయన పెద్దగా చేసేదేమీ లేదు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ ఏం అభివృద్ధి చేశారు? 18 నెలల పాలనలో రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు. ఎప్పుడైనా,ఎక్కడికైనా చర్చకు సిద్ధం. కేసీఆర్ సీతారామ ప్రాజెక్ట్ కడితే రేవంత్ రిబ్బన్ కట్‌చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటికి కాంట్రాక్ట్‌లు వచ్చాయి.2014లో ఖమ్మం ఎలా ఉండేది. మా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా?. ఖమ్మంను అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? సీఎం రేవంత్ సీటుకు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి ఎసరుపెడుతున్నారు.అందుకే వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి సీఎం రేవంత్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. -
రేవంత్‌వి చెత్త వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో ఢిల్లీ సమావేశంలో తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, తన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్‌పై చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ (చెత్త) బ్యాచేనని, కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి చెత్త వ్యాఖ్యలతో అది మరింత పెరిగిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. బనకచర్లపై అబద్ధాలు చెబుతున్నారు.. ‘బనకచర్ల ప్రాజెక్టు ఢిల్లీ భేటీ ఎజెండాలో ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెపుతుంటే, రేవంత్‌రెడ్డి అసలు చర్చకే రాలేదని అంటున్నారు. కేంద్ర జలశక్తి నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగినట్లు ఏపీలోని అన్ని పేపర్లలో వచి్చంది. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్‌రెడ్డి బాధ పడుతున్నాడు. అందుకే అబద్ధాలు చెపుతున్నాడు. కేటీఆర్ మీలా బ్యాగ్‌లు మోయలేదు.. మేము బనకచర్ల గురించి మాట్లాడుతుంటే ఆయన డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిలా కేటీఆర్ బ్యాగ్‌లు మోయలేదు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా బ్యాగులు మోసేవారే. పరిపాలన అంటే బ్యాగ్‌లు మోసుడు కాదని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. కేటీఆర్‌ను లోకేశ్ అర్ధరాత్రి పూట కలిశాడని అంటున్నాడు. రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్‌రెడ్డికే ఉంది. ఎవడో దుబాయ్‌లో చనిపోతే కేటీఆర్‌కు ఏం సంబంధం? కేటీఆర్‌పై చేసిన ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలి. లేదంటే కేటీఆర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి..’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా విఫలం ‘కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆస్పత్రుల్లో ఉంటున్నారు. మరోవైపు గ్రామాల్లో పాలన పడకేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై, నా క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై, సునీత లక్ష్మారెడ్డిపై, మర్రి రాజశేఖర్‌రెడ్డిపై దాడికి దిగుతున్నారు..’అని మాజీమంత్రి చెప్పారు. మా ఫోన్లతో పాటు విలేకరులవీ ట్యాప్ చేస్తున్నారు.. ‘రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అండగా ఉంటున్నాడు కాబట్టే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నిఘా పెట్టినా మాకేం కాదు. రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి..’అని హరీశ్‌రావు ఆరోపించారు. -
చంద్రబాబు స్క్రిప్టు.. రేవంత్ చిలక పలుకు
సిరిసిల్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తొత్తుగా మారారని, తెలంగాణ ప్రయోజనాలను గురుదక్షిణగా తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. ఇక్కడ మాట్లాడుతున్న చిలుక రేవంత్‌రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువని మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఆరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడీ ఒక ఎత్తయితే సీఎం రేవంత్‌రెడ్డి కోవర్టుగా మారి ఢిల్లీలో బుధవారం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఒక ఎత్తు అని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ పెడితే సమావేశానికే వెళ్లను అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఎలా మీటింగ్‌కు పోయారని ప్రశ్నించారు. అసలు ఆదిత్యనాథ్‌ను సాగునీటి సలహాదారుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతుల హక్కులను కాపాడడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు కనుసన్నల్లో కేంద్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని, తెలంగాణ జలవనరులను దోపిడీ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఆంధ్రా కూడా బాగుండాలని.. అదే సమయంలో తెలంగాణ నీటి వాటా తేలాలని కేసీఆర్ కోరుకున్నట్లు చెప్పారు. తమకు ఆంధ్రా ప్రజలతో గొడవ లేదని స్పష్టంచేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని. కన్నెపల్లిలో మోటార్లను ఆన్ చేస్తే తెలంగాణలో కరువు ఛాయలు ఉండవని అన్నారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు చూపాలి సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్ పేరుతో తనపై విషం చిమ్ముతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు సంయమనం పాటించానని, ఇకపై ఊరుకోబోనని స్పష్టంచేశారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్‌లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి మరీ రేవంత్‌రెడ్డి నాపై బురద జల్లుతున్నారు. న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే చిట్‌చాట్‌ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు. పిరికి దద్దమ్మలా చిట్‌చాట్‌ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇకపై వీటిని సహించేది లేదు. సీఎం చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేశారు. లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’అని హెచ్చరించారు.