
తెలంగాణను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చిన సీఎం
ఢిల్లీలో తెలంగాణ జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు
పిరికిపందలా ఢిల్లీకి వెళ్లి చిట్‌చాట్‌లతో నాపై దుష్ప్రచారం
నాపై డ్రగ్స్ కేసు ఉన్నట్లు దమ్ముంటే నిరూపించు
రేవంత్.. క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు
సిరిసిల్లలో కేటీఆర్ హెచ్చరిక
సిరిసిల్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తొత్తుగా మారారని, తెలంగాణ ప్రయోజనాలను గురుదక్షిణగా తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. ఇక్కడ మాట్లాడుతున్న చిలుక రేవంత్‌రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువని మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఆరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడీ ఒక ఎత్తయితే సీఎం రేవంత్‌రెడ్డి కోవర్టుగా మారి ఢిల్లీలో బుధవారం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఒక ఎత్తు అని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ పెడితే సమావేశానికే వెళ్లను అని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఎలా మీటింగ్‌కు పోయారని ప్రశ్నించారు. అసలు ఆదిత్యనాథ్‌ను సాగునీటి సలహాదారుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతుల హక్కులను కాపాడడానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్‌ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరించారు.
చంద్రబాబు కనుసన్నల్లో కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని, తెలంగాణ జలవనరులను దోపిడీ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఆంధ్రా కూడా బాగుండాలని.. అదే సమయంలో తెలంగాణ నీటి వాటా తేలాలని కేసీఆర్ కోరుకున్నట్లు చెప్పారు. తమకు ఆంధ్రా ప్రజలతో గొడవ లేదని స్పష్టంచేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని. కన్నెపల్లిలో మోటార్లను ఆన్ చేస్తే తెలంగాణలో కరువు ఛాయలు ఉండవని అన్నారు.
డ్రగ్స్ కేసులో ఆధారాలు చూపాలి
సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్ పేరుతో తనపై విషం చిమ్ముతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు సంయమనం పాటించానని, ఇకపై ఊరుకోబోనని స్పష్టంచేశారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్‌లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి మరీ రేవంత్‌రెడ్డి నాపై బురద జల్లుతున్నారు. న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే చిట్‌చాట్‌ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు. పిరికి దద్దమ్మలా చిట్‌చాట్‌ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇకపై వీటిని సహించేది లేదు. సీఎం చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేశారు. లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’అని హెచ్చరించారు.