
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి నోరు విప్పితే గోబెల్ ప్రచారమేనని, మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. అసత్యాల ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్నారని విమర్శించారు హరీష్. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తెలంగాణ భవన్‌లో హరీష్ మాట్లాడారు.
‘ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేమే కట్టం అంటున్నావు.. కత్తెర పట్టుకొని కేసీఆర్ కట్టినవి కట్ చేస్తున్నావ్.. పేర్లు మార్చుడు, కత్తెర పట్టుకొని కేసీఆర్ తిరగలేదు. ఎల్లంపల్లి కోసం 2వేల కోట్లు ఖర్చు పెట్టాము. రేవంత్ ప్రారంభోత్సవం చేసిన ఫ్లై ఓవర్లు, డ్యాములు కేసీఆర్ హాయంలోనివే. ఎల్లంపల్లి ద్వారా 20టిఎంసి హైదరాబాద్‌కు ఎలా తెస్తావ్?,
సీఎం కుర్చీకి గౌరవం పోగొడుతున్నావ్. కాళేశ్వరం మోటర్లతోనే నీళ్లు ప్రాజెక్టులకు వస్తున్నాయి. కేసీఆర్ ముందుచూపుతో మల్లన్నసాగర్ నిర్మించారు. గండిపేట, హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లే. కాళేశ్వరం లో 12రిజర్వాయర్లు.. అందులో భాగమే మల్లన్న సాగర్.
మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తా అంటే నీళ్లు ఎక్కడివి..?, కాళేశ్వరం నీళ్లే మల్లన్న సాగర్‌కి వస్తాయి. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపడితే... రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగం.. మల్లన్నసాగర్. కాళేశ్వరంను తిడుతావ్ అక్కడి నుండే నీళ్లు వచ్చేవి’ అని హరీష్ కౌంటర్ ఇచ్చారు.