
సాక్షి, వికారాబాద్: బీజేపీలో కొంత మంది తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని.. ఆ పార్టీలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టే రాజీనామా చేశానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని అందుకే పార్టీకి రాజీనామా ఇచ్చానన్న రాజాసింగ్.. కొన్నిసార్లు తనను ఢిల్లీ పిలిచి వార్నింగ్ కూడా ఇప్పించారన్నారు.
‘‘బీజేపీ స్టేట్ కమిటీలో 10 నుంచి 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పదవులు ఇచ్చారు. జిల్లాలో ఉండే కార్యకర్తకు పదవులు ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. బీజేపీ రాష్ట్ర కమిటీ రామచందర్ రావు వేశారా? కిషన్ రెడ్డి వేశారా?. బీజేపీ రాష్ట్ర కమిటీతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?’’ అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.
‘‘బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీని సర్వ నాశనం చేసేందుకు కమిటీ వేసినట్లు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కమిటీపై బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతృప్తిగా లేరు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని దెబ్బతీస్తున్నారు. రామచందర్ రావు మంచి మనిషి.. కానీ రబ్బర్ స్టాంప్’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
‘‘బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశోక్ మాట్లాడిన తీరు బాగాలేదు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ డబ్బులు వసూలు చేశారు. బీజేపీ కార్యకర్తలే నాలుగో సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. నా కార్యకర్తల కోసం మాట్లాడుతున్నా. బీజేపీనీ పండబెట్టారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరు. నేను రాజీనామా చేయను.. పీక్కొండి’’ అంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాకు పార్టీలో మర్యాద దక్కలేదు. కార్యకర్తల్లో పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఢిల్లీ నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. ఎన్నికల్లో పార్టీ సపోర్ట్ చేయలేదు. కార్యకర్తలకు అనుకూలంగా నేను మాట్లాడతా. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు 15 మందిని తీసుకువస్తే వాళ్లను దాచిపెట్టారు. వెనక ఉన్న వాళ్ళు బయటకు రండి. తెలంగాణలో ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి రాదు’’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.