
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.
నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న కేటీఆర్.. ఇన్ని రోజుల పాటు గ్రూప్-1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్ సమాధానం ఏంటి?: హరీష్
హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ఆయన మండిపడ్డారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఈ కోర్టు తీర్పుకు చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.
‘‘హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ మీ నిరక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు’’ అంటూ రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు మండిపడ్డారు.
గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..
పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.
లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న…— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2025