
కాంగ్రెస్‌కు ఓటువేస్తే మీ ఇళ్లను కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి బుద్ధి చెప్పండి
బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటువేస్తే మీ ఇళ్లను కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని స్థానిక ప్రజలను హెచ్చరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ రహమత్‌నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
డబ్బున్న పెద్దల జోలికెళ్లదు..
‘కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే అక్కసుతో బీఆర్‌ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చేశారు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. హైడ్రా ఇల్లు కూలగొడుతుందన్న భయంతో కూకట్‌పల్లిలోని బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకుంది. డబ్బున్న పెద్దల జోలికి ఈ ప్రభుత్వం పోదు. దుర్గం చెరువులో అక్రమంగా ఇల్లు కట్టుకున్న రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము అధికారులకు ఉందా?
ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోంది. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపివేస్తామంటూ ప్రజలను బెదిరిస్తోంది. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓటు అడిగే హక్కు ఆ పార్టీకి లేదు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లే..
‘ప్రధాని మోదీని పెద్దన్నలా భావించి ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్న బీజేపీ సీఎం రేవంత్‌రెడ్డి అన్న సత్యాన్ని మైనార్టీలు ఇప్పటికైనా గుర్తించాలి. రాహుల్‌గాంధీని తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ పార్టీని రేవంత్‌రెడ్డి తన పార్టీగా భావిస్తున్నారని, కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రజలు గమనించాలి. తెలంగాణాలో కాంగ్రెస్‌కు ఓటువేస్తే పీఎం నరేంద్ర మోదీ, బీజేపీకి ఓటు వేసినట్లే. రాష్ట్ర చరిత్రలో తొలిసారి మైనార్టీ మంత్రి ప్రభుత్వంలో లేరంటే.. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఏమిటో గుర్తించాలి.
మాగంటి కుటుంబానికి అండగా నిలవాలి
బీఆర్‌ఎస్ మైనార్టీలకు సముచిత స్థానం ఇచ్చింది. బీఆర్‌ఎస్‌తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యం. ప్రజలు అన్నీ గమనించి, ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచిన దివంగత మాగంటి గోపీనాథ్‌కు నివాళిగా..సంక్షేమాన్ని చేతల్లో చూపించిన బీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్‌లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అండగా నిలబడే వాడు. ఆయన కుటుంబానికి ప్రజలు అండగా నిలవాలి. కారు గుర్తుకు ఓటువేసి హస్తానికి తగు బుద్ధి చెబుతూ రేవంత్‌రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో అన్ని సీట్లను బీఆర్‌ఎస్‌కు అందించారని, అదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్‌లో గెలిపించి, హైదరాబాద్ గులాబీ అడ్డా అన్న సందేశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 14వ తేదీ నుంచి కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి, మాగంటి చేసిన పనులను, ఆయన సేవలను ఓటర్లకు గుర్తు చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కోరుకంటి చందర్, మాగంటి సతీమణి సునీత, రహమత్‌నగర్ ఇన్‌చార్జి టి.రవీందర్‌రావు పాల్గొన్నారు.