
ఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ శాతం కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుపై బీజేపీ వైఖరి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ బిల్లుపై బీజేపీకి అభ్యంతరం ఉంటే అసెంబ్లీలోనే ఎందుకు చెప్పలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఫ్యూడల్ ధోరణితో అన్యాయం చేస్తే తిరుగుబాటు చేస్తామని పొన్నం హెచ్చరించారు.
ముస్లింల పేరుతో బీసీల నోటి కాడి కూడు లాక్కోవొద్దన్నారు పొన్నం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారని విమర్శించారు. కిషన్‌రెడ్డి, రామచంద్రరావులు బీసీ వ్యతిరేకులుగా పొన్నం పేర్కొన్నారు. తాము ఏ కుల సర్వే చేసినా....కేంద్రం చేసేది ప్రామాణికం అవుతుందన్నారు.
ఆమోదిస్తారా?.. తిరస్కరిస్తారా?
రాష్ట్రపతి వద్ద ఉన్న తెలంగాణ బీసీ బిల్లును ఆమోదిస్తారా?, తిరస్కరిస్తారా? అనేది ఏదో ఒకటి చెప్పాలని మరొక మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయవద్దని, ఈ బిల్లును ఆమోదించేందుకు కిషన్‌రెడ్డి సహకరించాలన్నారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తే బీజేపీకి తెలంగాణలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు మంత్రి వాకిటి శ్రీహరి. సకల జనుల సమ్మె తరహాలో బీసీలు ఉద్యమిస్తారన్నారు.