
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడిన 141వ డివిజన్ (గౌతమ్ నగర్) కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్‌ను కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించామని.. రెండో సారి కూడా తిరుగులేని విజయం సాధించామన్నారు.
హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా రాలేదనే కారణంతో కాంగ్రెస్ గుండాగిరి రాజ్యం తెస్తోంది. మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్లు దేవుడి కార్యక్రమానికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో గొడవ చేస్తారా? మీ అడ్డా అని వీర్రవీగుతున్నారా?. అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలి పెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. గుండాల్లాగా రాజకీయం చేస్తూ బస్తీ మే సవాల్ అంటూ సవాల్ చేస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసులు కొంత మందికి తొత్తులుగా మారారు. మేము మిమ్మల్ని వదలం. మా కార్యకర్తలు తరలి వచ్చి మీ అంతు చూస్తాం. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రాలేదని ఇష్టానుసారంగా చేస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌లు చేయటం లేదు’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.