కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments at a media conference in Delhi | Sakshi
Sakshi News home page

కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్‌

Jul 24 2025 1:33 AM | Updated on Jul 24 2025 1:56 AM

CM Revanth Reddy Comments at a media conference in Delhi

బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి నేతల మద్దతు కూడగడతాం

42 శాతం రిజర్వేషన్లపై అన్ని పక్షాల సహకారంతో ఒత్తిడి పెంచుతాం

లొంగకపోతే ప్రధాని మోదీని దింపి, మా నేతను కూర్చోబెట్టి సాధించుకుంటాం  

ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు 

సెప్టెంబర్‌ 30లోగా స్థానిక ఎన్నికలు..42% రిజర్వేషన్ల అమలుకు కృతనిశ్చయంతో ఉన్నాం 

ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది 

రిజర్వేషన్లపై నేడు పార్టీ ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ 

ఓబీసీ నేత బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలన్న సీఎం 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు పిలిస్తే వెళ్తానని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం మెడలు వంచి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ అంశంలో కేంద్రాన్ని ఒప్పించేలా కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి పక్షాల నేతల మద్దతును సైతం కూడగడతామని చెప్పారు. తద్వారా ఒత్తిడి పెంచుతామని, ఒత్తిళ్లకు లొంగని పక్షంలో ప్రధాని మోదీని కుర్చీ దింపి, తమ నేతను కుర్చీలో కూర్చోబెట్టి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు. 

హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని, ఓబీసీ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సిట్‌ విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర ఎంపీలతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

రెండు బిల్లులు పంపించాం.. 
కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే పూర్తి చేసింది. అందులో వెల్లడైన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆ మేరకు రిజర్వేషన్ల కోసం ఒకటి, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒకటి..ఇలా శాసనసభలో రెండు బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఈ విషయంలో సహకరించాలని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రం తాత్సారం చేస్తోంది..   
  
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నాం. అయితే కేంద్రం ఆమోదించకుండా తాత్సారం చేస్తోంది. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే, కాంగ్రెస్‌ అనేక పోరాటాలు చేసి వాటిని వెనక్కి తీసుకునేలా చేసింది. కులగణనను చేయబోమన్న కేంద్రాన్ని జనగణనలో కులగణనను భాగం చేసేలా ఒప్పించింది. అదే మాదిరి ఇప్పుడు కూడా కేంద్రం మెడలు వంచుతాం. 

మా అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేయాలన్న ఉద్దేశంతో నేను, మా ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వచ్చాం. వారిని కలవడంతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలందరినీ కలిసి రాష్ట్రంలో నిర్వహించిన సర్వే గురించి వివరిస్తాం. అలాగే ఇండియా కూటమిలోని ఇతర సభ్యులను కలుస్తాం. సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. 

గురువారం కాంగ్రెస్‌ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని అంటున్నరు. అసలు అఖిల పక్షం ఎక్కడుంది? ప్రధాన ప్రతిపక్ష నేత నిద్రపోతున్నడు. ఆయన పిల్లలు కొట్లాడుకుంటున్నరు. తాను చెడిన కోతి వనమెల్లా చెరిచినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకేం అఖిలపక్షం. బీజేపీ రిజర్వేషన్లు వద్దంటోంది. ఎంఐఎం మద్దతిస్తోంది. 

బీజేపీది వితండ వాదం.. 
ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వితండ వాదం చేస్తోంది. ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తే, కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు మాత్రం వితండ వాదం చేస్తున్నారు. బీజేపీకి ఒకటి, కాంగ్రెస్‌కు మరొక రాజ్యాంగం లేదు. అంబేడ్కర్‌ రాజ్యాంగమే అందరికీ అమలవుతోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తే మద్దతు ఇస్తామని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అంటున్నారు. వాళ్లకు కనీస అవగాహన లేదు. 

గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లిం రిజర్వేషన్లు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన తర్వాత తెలంగాణకు అలా సూచించండి. గుజరాత్‌లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్న అమిత్‌ షాను బీజేపీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? మొండి, తొండి వాదనను పక్కనబెట్టాలి. బలహీన వర్గాలకు న్యాయం చేయాలి.  

వచ్చే ఎన్నికలు లిట్మస్‌ టెస్టువంటివి 
2029 లోక్‌సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్‌ టెస్ట్‌ వంటివి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడా ఇవ్వలేదు. కేవలం వెనుకబాటుతనంలో ఉన్నవారికే రిజర్వేషన్‌ ఇస్తున్నాం. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట మంత్రివర్గంలో చర్చించి త్వరలో శాసనసభలో ప్రవేశపెడతాం. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు తర్వాత మొత్తం 50 శాతం రిజర్వేషన్లే అనేది ఎప్పుడో పోయింది. 

కొందరు వితండవాదులు చేసే వాదనలకు కోర్టులే సమాధానం చెబుతాయి. మొదట రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత సబ్‌ కేటగిరైజేషన్‌ గురించి ఎక్స్‌పర్ట్‌ కమిటీ చర్చిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. 

తప్పులు సరిదిద్దుకోవాలంటే దత్తాత్రేయకు చాన్స్‌ ఇవ్వాలి 
ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి. గతంలో వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రపతి చేసే అంశంపై చర్చ జరిగింది. ఆయనను ఢిల్లీ నుంచి వెనక్కి పంపించేశారు. తెలుగు మాట్లాడే ఆయనను ఘర్‌వాపసీ చేయించారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తెలంగాణ నేత, సౌమ్యుడైన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. గవర్నర్‌గా ఆయన పదవీకాలం పూర్తయింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారు. 

గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించారు. ఇప్పుడు ఆ పదవి బ్రాహ్మణుడైన ఎన్‌.రామచందర్‌రావుకు ఇచ్చారు. బీజేపీ తెలంగాణలోని ఓబీసీ నేతల గొంతు కోసింది. ఈ తప్పులన్నింటినీ క్షమించాలంటే దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున దత్తాత్రేయకు, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నా. దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి అందరి ఆమోదం ఉంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ గౌరవించాలి. 

సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్‌ చేశారంట.. 
మీడియా సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫోన్‌ ట్యాపింగ్‌పై మాట్లాడారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ విచారణ జరుగుతోంది. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్‌ చేశారని తెలుస్తోంది. సొంతింటి వాళ్లవి చేసేకన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం. నా ఫోన్‌ ట్యాప్‌ అయిందో? లేదో నాకు తెలియదు. నా ఫోన్‌ ట్యాప్‌ అయ్యుంటే నన్ను విచారణకు పిలిచివారు కదా. ఒకవేళ సిట్‌ విచారణకు పిలిస్తే కచ్చితంగా వెళతా. మా ప్రభుత్వానికి ఫోన్‌ ట్యాపింగ్‌లు చేసే ఉద్దేశం లేదు. దానివల్ల ఒనగూరేది లేదు. ఇది గత ఎన్నికల్లోనే రుజువైంది..’అని అన్నారు.  

నిబంధనల మేరకే సీఎం రమేశ్‌ కంపెనీకి కాంట్రాక్టు 
ఫ్యూచర్‌ సిటీలో రోడ్ల కాంట్రాక్టు టెండర్‌ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు ఇవ్వడంపై ప్రశ్నించగా.. ‘రూ.1,600 కోట్ల ఈ–టెండర్‌ను నిబంధనల మేరకే వారి కంపెనీ దక్కించుకుంది. ఎల్‌అండ్‌టీ సైతం ఈ–టెండర్‌లో పాల్గొంది. నా మిత్రుడని ఈ టెండర్‌ కట్టబెట్టలేదు. ఓపెన్‌ టెండర్‌లోనే వారికి దక్కింది..’అని రేవంత్‌ వివరించారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి ఎక్కడా రుణాలు తీసుకోలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వ సావరిన్‌ బాండ్లను వేరే కంపెనీలు కొనుక్కున్నాయని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement