
చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకే కేటీఆర్‌పై ఆరోపణలు
మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు
మేం బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం
ఆయన డ్రగ్స్ అంటూ మోకాలుకు, బోడిగుండుకు ముడి పెడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో ఢిల్లీ సమావేశంలో తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, తన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్‌పై చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ (చెత్త) బ్యాచేనని, కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి చెత్త వ్యాఖ్యలతో అది మరింత పెరిగిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.
బనకచర్లపై అబద్ధాలు చెబుతున్నారు..
‘బనకచర్ల ప్రాజెక్టు ఢిల్లీ భేటీ ఎజెండాలో ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెపుతుంటే, రేవంత్‌రెడ్డి అసలు చర్చకే రాలేదని అంటున్నారు. కేంద్ర జలశక్తి నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగినట్లు ఏపీలోని అన్ని పేపర్లలో వచి్చంది. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్‌రెడ్డి బాధ పడుతున్నాడు. అందుకే అబద్ధాలు చెపుతున్నాడు.
కేటీఆర్ మీలా బ్యాగ్‌లు మోయలేదు..
మేము బనకచర్ల గురించి మాట్లాడుతుంటే ఆయన డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిలా కేటీఆర్ బ్యాగ్‌లు మోయలేదు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా బ్యాగులు మోసేవారే. పరిపాలన అంటే బ్యాగ్‌లు మోసుడు కాదని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. కేటీఆర్‌ను లోకేశ్ అర్ధరాత్రి పూట కలిశాడని అంటున్నాడు. రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్‌రెడ్డికే ఉంది. ఎవడో దుబాయ్‌లో చనిపోతే కేటీఆర్‌కు ఏం సంబంధం? కేటీఆర్‌పై చేసిన ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలి. లేదంటే కేటీఆర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి..’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
శాంతిభద్రతలు పూర్తిగా విఫలం
‘కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆస్పత్రుల్లో ఉంటున్నారు. మరోవైపు గ్రామాల్లో పాలన పడకేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై, నా క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై, సునీత లక్ష్మారెడ్డిపై, మర్రి రాజశేఖర్‌రెడ్డిపై దాడికి దిగుతున్నారు..’అని మాజీమంత్రి చెప్పారు.
మా ఫోన్లతో పాటు విలేకరులవీ ట్యాప్ చేస్తున్నారు..
‘రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అండగా ఉంటున్నాడు కాబట్టే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నిఘా పెట్టినా మాకేం కాదు. రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి..’అని హరీశ్‌రావు ఆరోపించారు.