
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్‌పై మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ విషయంలో కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాలి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాహుల్‌పై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా?. ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?. ఓట్ చోరీ గురించి రాహుల్ ఆధారాలతో నిరూపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలేదు.
బీజేపీ, బీఆర్‌ఎస్ వేరు కాదు.. లోపాయికారీ ఒప్పందంలో ఉన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై ఇప్పటికే కవిత చెప్పారు. ముందు కవిత మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కూడా ఎందుకు స్పందించడం లేదు. ఎందుకంటే రెండు పార్టీలు మానసికంగా ఒక్కటే కానీ.. భౌతికంగా ఒక్కటి కావాల్సి ఉంది. అందుకే రాహుల్‌పై కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.