
హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీని వీడిన పలువురు కాంగ్రెస్‌లో చేరారని బీఆర్‌ఎస్ అంటుంటే, వారు తమ పార్టీలో చేరలేదని కాంగ్రెస్ అంటోంది. అయితే దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చోరీకి పాల్పడిందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాహుల్ ఫోటోలు దిగారని, ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఏంటని ప్రశ్నించారు. ఓట్ల చోరీపై మాట్లాడే రాహుల్.. దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు కేటీఆర్.
ఇక తాము కాంగ్రెస్‌లో చేరలేదని ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ను కలిశామని అంటున్నారు.
కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు.