
స్థానిక ఎన్నికలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్టీ కోసం కష్టపడిన కేడర్‌ను గెలిపించుకుంటాం.. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలి
పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారు.. గులాబీ జెండా ఎగిరితే అధికారుల వైఖరిలో మార్పు వస్తుందని వెల్లడి
బీఆర్‌ఎస్‌లోకి వికారాబాద్,సిర్పూర్ నుంచి చేరికలు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ప్రీఫైనల్ లాంటివని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన కేడర్‌ను గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు.
వికారాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, బాల్కొండ పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
మల్కాజిగిరిలో గూండాలు రోడ్డు మీద షో చేసినా పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తే అధికారులందరూ తమ పద్ధతి మార్చుకుంటారన్నారు. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలుపొందితే అధికారుల వేధింపులకు అవకాశం ఉండదని చెప్పారు.
కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం
‘పదేళ్ల అధికారాన్ని తపస్సుగా భావించి తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసే క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోలేదనేది వాస్తవం. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పును పునరావృతం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం.
బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్‌ఎస్ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చాం. మీ సేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను కూడా పెద్దసభలు పెట్టి పంపిణీ చేస్తూ రేవంత్ గొప్పగా చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు.
ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, నూలి శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు.