
మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో సబిత, లక్ష్మారెడ్డి, కార్తీక్‌రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష
సొంత భూముల కోసమే ఫ్యూచర్ సిటీపై సీఎం ఖర్చు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు
‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు బీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్‌ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.
పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండ
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్‌ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు.